చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Feb 26,2024 20:37 #Chandrababu Naidu, #supreem court

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికారులను బెదిరిస్తున్నారని ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని, వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని కోరారు. అందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

‘చంద్రబాబు కుటుంబం ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తోంది. వారు అధికారంలోకి వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోంది. ఈ కేసులో బెయిల్‌ మంజూరు తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారు. వెంటనే బెయిల్‌ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’ అని ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికీ తాము సమాధానం ఇస్తామని చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌ సాల్వే, సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. మార్చి 19న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.

➡️