ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ జనవరి 31కి వాయిదా

న్యూఢిల్లీ :   జెఎన్‌యు మాజీ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను బుధవారం సుప్రీంకోర్టు జనవరి 31కి వాయిదావేసింది. జస్టిస్‌ బేలా.ఎం.త్రివేది, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం లంచ్‌ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఈ కేసు విచారణను ఈ నెలాఖరుకి వాయిదా వేసింది. జనవరి 31కి జాబితా చేశామని, ఉన్నత ధర్మాసనం విచారణ చేపడుతుందని ధర్మానసం తెలిపింది. ఖలీద్‌ తరపున సీనియర్‌ న్యాయవాది సి.యు. సింగ్‌ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే లంచ్‌ వరకు మాత్రమే ధర్మాసనం అందుబాటులో ఉండటంతో ఈ పిటిషన్‌ సహా ఉపా చట్టంలోని పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లన్నింటినీ అదే తేదీకి జాబితా చేసింది.

బెయిల్‌ను తిరస్కరిస్తూ 2022 అక్టోబర్‌ 18న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఖలీద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టాల్సి వుంది. అయితే గతేడాది ఆగస్ట్‌ 9న  జస్టీస్  ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఈ పిటిషన్‌ విచారణ నుండి తప్పుకున్నారు.

ఉమర్‌ ఖలీద్‌, షర్జీల్‌ ఇమామ్‌ సహా పలువురు విద్యార్థులపై ఫిబ్రవరి 2020 ఢిల్లీ అల్లర్లకు ‘సూత్రధారులు ‘ అని ఆరోపిస్తూ ఉపా చట్టం, ఐపిసిలోని పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

➡️