కేరళ యూనివర్శిటీ సెనేట్‌కు గవర్నర్‌ నామినేషన్లు తిరస్కరించిన హైకోర్టు

తిరువనంతపురం : కేరళ యూనివర్శిటీ సెనేట్‌కు యూనివర్శిటీల ఛాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ చేసిన నామినేషన్లను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఆరు వారాల వ్యవధిలో కొత్త నామినీలను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఇదే యూనివర్శిటీకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన నామినేషన్లపై హైకోర్టు ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఆరిఫ్‌ ఖాన్‌ నామినేషన్లు కొట్టివేస్తూ చట్ట ప్రకారం నామినేషన్లు వేయడానికి ఛాన్సలర్‌కు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఫైన్‌ ఆర్ట్స్‌, స్పోర్ట్స్‌, హ్యుమానిటీష్‌, సైన్స్‌ విభాగాల్లో ఆరిఫ్‌ ఖాన్‌ చేసిన నామినేషన్లను సవాల్‌ చేస్తూ నలుగురు విద్యార్థులు రెండు వేరు వేరు పిటీషన్ల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ సాధారణ నియమాలను కూడా అనుసరించలేదని, ఎటువంటి అర్హత లేని వ్యక్తులను సెనేట్‌కు నామినేట్‌ చేశారని పిటీషనర్లు ఆరోపించారు. అలాగే మరోవైపు ప్రభుత్వం వేసిన నామినేషన్లును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లు హైకోర్టు తిరస్కరించింది.
హైకోర్టు తీర్పును కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, సిపిఎం స్వాగతించాయి.

➡️