అస్సాం మయన్మార్‌లో భాగమే అన్న కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ సిఎం హిమంత్‌

Dec 9,2023 18:03 #Kapil Sibal, #national

 

గౌహతి : అస్సాం గతంలో మయన్మార్‌లో భాగంగా ఉండేదని ప్రముఖ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వ శర్మ మండిపడ్డారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదని అస్సాం రాష్ట్ర చరిత్ర గురించి తెలియకపోతే తెలుసుకోవాలని హిమంత్‌ విమర్శించారు. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6ఎ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై కపిల్‌ సిబల్‌ బుధవారం వాదించారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లపై తన వాదనల్ని వినిపిస్తూ.. ‘వలసలపై ఎలాంటి రికార్డులు ఉండవు. ఒకవేళ మీరు అస్సాం చరిత్రను చూసినట్లయితే ఎవరు? ఎప్పుడు వచ్చారనేది గుర్తించడం అసాధ్యం అని మీకు తెలుస్తుంది. వాస్తవానికి అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో భాగం. 1824లో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అస్సాంను మయన్మార్‌ బ్రిటిష్‌ వారికి అప్పగించింది.’ అని వ్యాఖ్యానించారు. అయితే కపిల్‌ సిబల్‌ వాదనలకు సంబంధించి మీడియాలో కథనాలు రావడంతో వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై హిమంత్‌ తాజాగా స్పందిస్తూ.. ‘అస్సాం చరిత్ర గురించి తెలియనివారు.. మా రాష్ట్రం గురించి మాట్లాడొద్దు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదు. ఒక సమయంలో ఇరువురికి ఘర్షణలు జరిగాయి. అంతేతప్ప అస్సాం మయన్మార్‌లో భాగమని చెప్పే సమాచారం నేనింత వరకు చూడలేదు.’ అని అన్నారు.

➡️