CPM: బలపడుతున్న హైబ్రిడ్ నియంతృత్వం : బృందా కరత్

త్రిస్సూర్ :  ప్రజాస్వామ్య ముసుగులో అంతర్గత నియంతృత్వంతో కూడిన హైబ్రిడ్ నియంతృత్వం భారతదేశంలో బలపడుతున్నదని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్  అన్నారు. ఈఎంఎస్ నంబూత్రిపాద్ 115వ జయంతి సందర్భంగా కేరళలో ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్ లో ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం – నియంతృత్వం’ అనే అంశంపై ఆమె ప్రసంగించారు. బృందా కరత్ మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే నాయకుడు, ఒకే విధానం అన్నది బీజేపీ ప్రభుత్వ వైఖరి అని ఆమె తెలిపారు. పార్లమెంటును అదుపులో ఉంచడం ద్వారా కార్పొరేట్ల ప్రయోజనాలను కొనసాగించడానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను అంచెలంచెలుగా నాశనం చేసే ధోరణి ఇదని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ కాలంలో ఉపా (యూఏపీఏ) కేసుల సంఖ్య 72 శాతం పెరిగిందని ఆగ్రహించారు. అనేకమంది నాయకులను తప్పుడు సాక్ష్యాధారాలతో జైల్లో పెట్టారని మండిపడ్డారు. బీజేపీకి ఒంటరిగా మెజారిటీ లేదన్న ధీమాతో ఉండకూడదని పిలుపునిచ్చారు. అయోధ్యలో ఓటమి పాలైనప్పటికీ, అనేక ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని వెల్లడించారు. ప్రజాస్వామ్య జోక్యం ద్వారానే దేశం మొత్తం నియంతృత్వానికి వెళ్లకుండా నిరోధించగలమని బృందా కరత్ అన్నారు. మరో సెషన్ లో పొలిట్ బ్యూరో సభ్యులు ఏ విజయరాఘవన్ “వన్ నేషన్ వన్ ఎలక్షన్” అనే అంశంపై  మాట్లాడారు.

➡️