మోడీ వస్తే సార్వత్రిక ఎన్నికలు చూడలేం…

  •  డీఎంకె కూటమికి అన్ని సీట్లు

ప్రజాశక్తి – చెన్నై : లోకసభ ఎన్నికల్లో ఈసారి బిజెపి మళ్లీ వస్తే దేశం మరోసారి సార్వత్రిక ఎన్నికలు చూడబోదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. భారతదేశంలో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చి వేసి నిరంకుశత్వాన్ని తీసుకొస్తారని మోడీపై ధ్వజమెత్తారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్‌ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగం మారకుండా అడ్డుకోవడమే తమ కూటమి లక్ష్యం అన్నారు. నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకొస్తే ఏ ఒక్కరికీ న్యాయం జరగదన్నారు. బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఉత్తర భారత దేశంలోనూ బిజెపి ప్రభావం క్రమంగా తగ్గుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు బిజెపికి ఓట్లు వేయరని స్పష్టం చేశారు. ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నికల ఫలితాల అనంతరమే తెరమీదకు వస్తారని తెలిపారు. గతంలో మన్మోహన్‌ సింగ్‌ మాదిరిగానే, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పీఎం అభ్యర్థిని ఇండియా కూటమి ప్రకటిస్తుందన్నారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులుగా సమర్థులైన, అనుభవం గల నేతలు చాలామంది ఉన్నారని గుర్తు చేశారు. కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై మాట్లాడుతూ.. ప్రధాని మోడీ శ్రీలంకను చాలాసార్లు సందర్శించారు. ఎందుకు ఒక్కసారి కూడా కచ్చతీవు గురించి ప్రస్తావించలేద’ని ప్రశ్నించారు. ఎన్నికలవేళ కచ్చ తీవు వ్యవహారంపై మోడీ ముసలి కన్నీరు కారుస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమికి 38 ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. డీఎంకేకి 23, కాంగ్రెస్‌ కి 8, సిపిఎంకు రెండు, సిపిఐ 2, వీసీకే కి రెండు, ముస్లిం లీగ్‌ పార్టీకి ఒక ఎంపీ సీటు వచ్చిందన్నారు. ఈసారి తమకూటమికి 39కి 39 సీట్లు కచ్చితంగా వచ్చి తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు.

➡️