ఉద్యోగోన్నతులపై నిర్ణయం తీసుకోకుంటే సహాయ నిరాకరణే : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్చరిక

  • ఢిల్లీలో పీస్‌ మార్చ్‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగోన్నతుల విషయంలో సత్వర నిర్ణయం తీసుకోకుంటే సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు. అనేక మంది ఉద్యోగులు ఉద్యోగోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్నారని, కెరీర్‌లో ఎదుగుదల లేదని, పెన్షన్‌లోనూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని రైసినా హిల్స్‌లో వందలాదిమంది సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ (సిఎస్‌ఎస్‌) అధికారులు పీస్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు హోం, రక్షణ శాఖతో సహా అనేక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. పదోన్నతుల విషయంపై 2022లో నియమించిన కేడర్‌ రివ్యూ కమిటీ (సిఆర్‌సి) ఇంకా నివేదికను సమర్పించలేదని ఉద్యోగులు విమర్శించారు. సిఎస్‌ఎస్‌ ప్రతిస్థాయిలోనూ తన చర్చలను ఇప్పటికే పూర్తిచేసిందని, తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం కనీసం 20 ప్రభుత్వ విభాగాలు దాదాపు 2,500 అదనపు పోస్టుల కోసం అభ్యర్థనలను పంపాయి. సిఎస్‌ఎస్‌ నివేదిక సమర్పణలో జాప్యం కారణంగా ఈ విభాగాలన్నీ సిబ్బంది కొరతతో బాధపడుతున్నా యని ఉద్యోగులు తెలిపారు. రానున్న రోజుల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించా లని ఉద్యోగులు నిర్ణయించారు. ‘అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. అధికారిక సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ మాత్రమే పనిచేస్తాం. అదనపు సమయం పనిచేయం’ అని ఉద్యోగులు హెచ్చరించారు.

➡️