దండకారణ్యంలో ఆగని వేట

8 మంది మావోయిస్టుల కాల్చివేత
మందుపాతర పేలి ఇద్దరు చిన్నారుల మృతి

ప్రజాశక్తి-చర్ల : మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా భమ్రాగఢ్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఎనిమిదిమంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఘటనా స్థలం నుంచి ఒక మహిళా మావోయిస్టు సహా ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. . ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశం ఇటు ఛత్తీస్‌గఢ్‌ అటు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.. చనిపోయినవారిలో పెరమిలి దళం కమాండర్‌ వాసు ఉన్నట్టు సమాచారం.
14మంది మావోయిస్టుల అరెస్టు
ఛత్తీస్‌గఢ్‌, బీజాపూర్‌ జిల్లాలోని గంగుళూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముట్వెండి, పిడియా అటవీ ప్రాంతంలో 14 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పేలిన మందుపాతర
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఇంద్రావతి నదికి అవతల ఉన్న బడ్గా గ్రామంలో బిజిఎల్‌ (బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్‌) సెల్‌ పేలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. గ్రామ సమీపంలోని పొలంలో పిల్లలు ఆడుకుంటూ యుబిజిఎల్‌పై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భైరంగఢ్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఘటన సమాచారం అందిందని, పరిశీలిస్తున్నామని జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లలో గ్రామస్తులను తెచ్చి చంపేశారని, వారు మావోయిస్టులు కాదని పౌరసంఘాలు విమర్శిస్తున్నాయి.

➡️