ఇండియా బ్లాక్‌కే బీహార్‌లో అత్యధిక స్థానాలు

May 7,2024 05:20 #2024 election, #Bihar, #election
  •  ఈ ఎన్నికలు పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం మధ్య పోరాటం
  •  నితీష్‌ కుమార్‌ సైద్ధాంతిక విధేయతలేని అధికార దాహం ఉన్న వ్యక్తి
  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లాలన్‌ చౌదరి

బీహార్‌లోని ఖగారియా రైల్వే స్టేషన్‌ సమీపంలోని సిపిఎం జిల్లా కమిటీ కార్యాలయం ఎన్నికల కమాండ్‌ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు తక్షణ సలహాలు, సహాయం అందించేందుకు సీనియర్‌ నేతలు ఎప్పుడూ ఇక్కడే ఉంటున్నారు. కార్యాలయంలో ఉన్న సిపిఎం బీహార్‌ రాష్ట్ర కార్యదర్శి లాలన్‌ చౌదరి బీహార్‌ ఎన్నికల గురించి ‘ప్రజాశక్తి’తో మాట్లాడారు.

ఖగారియాపై మీ అంచనాలు ఏమిటి?
బీహార్‌లో సిపిఎం పోటీ చేసే ఖగారియాలో స్థానికంగా బాగా ప్రభావం చూపే సంజరు కుమార్‌ ఇండియా ఫోరంకి బలమైన అభ్యర్థి. ఒక వైపు స్థానిక ప్రజా పోరాటాల ముఖం. మరోవైపు నాన్‌లోకల్‌ అయిన ఎన్‌డిఎ అభ్యర్థి మధ్య పోరు జరుగుతోంది. ఎన్‌డిఎ అభ్యర్థి రాజేష్‌ వర్మ డబ్బులు వెదజల్లి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎన్నికలు పెట్టుబడిదారీ విధానానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న సమరం. మోడీ విభజన విధానాలకు ఓటర్లు కూడా సరైన సమాధానం ఇస్తారు.

ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ గురించి?
స్వయం ప్రకటిత సోషలిస్టు అయినప్పటికీ సైద్ధాంతిక విధేయత లేని, అధికార దాహం ఉన్న వ్యక్తి. అధికారమే ఆయన ఏకైక రాజకీయ తత్వశాస్త్రం. దాని కోసం ఏ పక్షం అయినా తీసుకుంటారు. 400 సీట్లు గెలుస్తామని ప్రధాని మోడీతో హాజరైన ర్యాలీలో నితీష్‌ అని నాలుక కరుచుకున్నారు.

ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు?
బీహార్‌ అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. ఉపాధి వెతుక్కుంటూ కేరళ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు వలసపోతుంటారు. నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మెరుగైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం లేదు. విద్య కోసం విద్యార్థులు ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్నారు. పంటలకు చట్టబద్ధమైన మద్దతు ధర లేకపోవడం వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రభుత్వ మండీల పనితీరు నిలిచిపోయింది. పెట్టుబడి ఖర్చు భరించలేక రైతులు వ్యవసాయం మానేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఒక ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన కనీస సేవలు కూడా బీహార్‌లో లేవు. వీటన్నింటికి అద్దం పట్టేలా ఎన్నికల ఫలితం ఉండబోతోంది. రాష్ట్రంలో ఇండియా ఫోరం ఎక్కువ సీట్లు గెలుస్తుంది. మొదటి, రెండో దశల్లో బిజెపికి సానుకూలత లేకపోవడం ఎన్‌డిఎను ఆందోళనకు గురి చేస్తున్నది.

– జె.జగదీష్‌

➡️