భారత్‌ పేద దేశమే

May 13,2024 07:27 #India, #poor country

– మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా పరిస్థితి మారదు
– 140 కోట్ల జనాభా కారణంగానే మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ
– అంతే తప్పితే ఆనందించటానికి ఏమీ లేదు
– ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు
న్యూఢిల్లీ : గత 20 ఏళ్ల పాలనను చూస్తే రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు చెరో పదేండ్లు పాలించాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్తున్నాయి. ఇక మోడీ సర్కారు అయితే తమ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరిందని చెప్పుకుంటున్నది. ప్రస్తుతం భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉన్నది. మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తే భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా తీర్చి దిద్దుతానని మోడీ చెప్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం మోడీ తన మాటలతో ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మాత్రం అలా చేయడం గణాంకాల వరకే పరిమితంగానీ, ఆచరణ సాధ్యం కాని విషయమని అన్నారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) ప్రకారం.. కొంతకాలంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ ఉన్నది. 2023 ఆర్థిక సంవత్సరంలో దాని వృద్ధి రేటు 7.2 శాతంగా ఉన్నది. ఇది జీ20 దేశాలలో రెండో అత్యధికం. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థల సగటు కంటే దాదాపు రెండింతలు.
ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకారం.. వచ్చే నెలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదనీ, ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా. ”మోడీ ప్రభుత్వం మళ్లీ మూడోసారి ఏర్పాటవుతుంది. ప్రధాని ప్రకటన ప్రకారం వచ్చే ఏడాది లేదా మరి కొంత కాలంలో ఐదో స్థానం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుకుంటుంది” అని రాంచీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె చెప్పారు. వచ్చే మూడేళ్లలో (2027 నాటికి) భారత్‌.. జపాన్‌, జర్మనీలను అధిగమించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపారు. అయితే, గత నవంబర్‌లో ఆమె చేసిన మునుపటి అంచనాతో ఈ లక్ష్యం విరుద్ధంగా ఉన్నదని నిపుణులు అంటున్నారు.
గత నెలలో విడుదల చేసిన ఐఎంఎఫ్‌ ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రకారం.. భారత్‌ ప్రస్తుతం 2023లో 3.6 ట్రిలియన్‌ డాలర్ల ఉత్పత్తితో ఐదో స్థానంలో ఉన్నది. జర్మనీ, జపాన్‌ వరుసగా 4.45 ట్రిలియన్‌ డాలర్‌, 4.21 ట్రిలియన్‌ డాలర్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయితే, 2024లో భారత జాతీయ ఉత్పత్తి 3.9 ట్రిలియన్‌ డాలర్లకు పెరగవచ్చు. అయితే, జపాన్‌ ర్యాంకింగ్‌ 4.1 ట్రిలియన్‌ డాలర్లకు తగ్గిపోయినప్పటికీ.. భారత్‌ ర్యాంకింగ్‌ స్థిరంగా ఉంటుంది. వాస్తవానికి, 2025లో భారత్‌..జపాన్‌ను అధిగమించి 4.4 ట్రిలియన్‌ డాలర్ల ఉత్పత్తితో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుందనీ, జపాన్‌ ఆర్థిక వ్యవస్థ 4.3 ట్రిలియన్‌ డాలర్లతో ఐదో స్థానంలో స్థిరపడుతుంది.
మూడో ఆర్థిక వ్యవస్థకు చేరాలంటే అంత సులువు కాదన్న విషయాన్ని చిదంబరంతో పాటు ఆర్థిక నిపుణులూ వినిపిస్తున్నారు. 2025 నాటికి ఉంటుందని సీతారామన్‌ చెప్తున్నప్పటికీ అదంత సులువేం కాదని అంటున్నారు. ఐఎంఎఫ్‌.. భారత్‌.. జర్మనీని అధిగమించి 2027 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నది. అయితే కొంతమంది ఆర్థికవేత్తలు దీనిని 2029 తర్వాత మాత్రమే సాధించగలమని అంచనా వేస్తున్నారు.
అయితే, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గణాంకాలు ఎలా ఉన్నా.. దేశంలో మాత్రం పేద, మధ్య తరగతి ఆర్థిక స్థితిగతులు మాత్రం మారటం లేదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికీ, దేశంలోని అనేక మంది ప్రజలకు తినటానికి సరైన తిండి దొరకటం లేదనీ, ఉండటానికి నివాసమూ లేదని చెప్తున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ప్రకారం.. మనం ఎప్పుడు మూడో స్థానానికి చేరుకున్నా, ఆనందించటానికి మాత్రం ఎలాంటి కారణమూ లేదు. ఎందుకంటే, భారత్‌ పేద దేశంగా మిగిలిపోయే అవకాశం ఉన్నది. ”నా అభిప్రాయం ప్రకారం.. భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారటం సాధ్యమే. కానీ ఇది వేడుక కాదు. ఎందుకంటే.. 140 కోట్ల జనాభా ఉన్నందున మనం పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రజలు ఉత్పత్తికి కారకులు. కాబట్టి మనం పెద్ద ఆర్థిక వ్యవస్థ ఎందుకంటే మనకు ప్రజలు ఉన్నారు. కానీ మనది ఇప్పటికీ పేద దేశమే..” అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

➡️