తక్షణమే బలపరీక్ష – హర్యానా గవర్నర్‌కు జెజెపి లేఖ

May 10,2024 01:20 #Haryana Governor, #JJP letter

– మెజార్టీ కాపాడుకునేందుకు బిజెపి బేరసారాలు
చండీగఢ్‌ : హర్యానాలో బిజెపి ప్రభుత్వానికి తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) అధ్యక్షులు దుశ్యంత్‌ చౌతాలా లేఖ రాసారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఉపసంహరించుకోవడంతో రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం మైనార్టీలో పడిన నేపథ్యంలో చౌతాలా గవర్నర్‌కు ఈ విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న రాజకీయ పరిస్థితిపై మెమెరాండం సమర్పించడానికి శుక్రవారం సమయం ఇవ్వాలని కూడా లేఖలో గవర్నర్‌ను చౌతాలా కోరారు. ‘హరాన్యాలో రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించడం, ప్రజాస్వామ్య నిబంధనలను కొనసాగించడం వంటి తక్షణ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, మెజార్టీ ప్రభుత్వాన్ని నిర్ణయించడానికి తక్షణమే బలపరీక్ష నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేయమని, మీ రాజ్యాంగపరమైన అధికారాన్ని అమలు చేయమని మిమ్మల్ని కోరుతున్నాను’ అని లేఖలో చౌతాలా తెలిపారు. కాగా, మరోవైపు అసెంబ్లీలో మెజార్టీ కోల్పోవడంతో బిజెపి కుయుక్తులకు పాల్పడుతోంది. జెజెపిలోని కొంత మంది ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతోంది. మహారాష్ట్రలో శివసేనను చీల్చినట్లే జెజెపిని కూడా చీల్చడానికి యత్నం చేస్తుంది. హర్యానాలో మొత్తం ఎమ్మెల్యే సంఖ్య 90 కాగా, ప్రస్తుతం 88 ఎమ్మెల్యేలు ఉన్నారు. బిజెపికి 40, కాంగ్రెస్‌కు 30, జెజెపికి 10 మంది ఉన్నారు. మిగిలిన వారు స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

➡️