హేమంత్‌ సోరేన్‌ కస్టడీపై తీర్పు రిజర్వ్‌ – నేడు సుప్రీం విచారణ

  • గవర్నర్‌ను మళ్లీ కలిసినచంపాయ్
  • సోరేన్‌ ప్రమాణస్వీకారంలో ఆలస్యమెందుకు ?
  • జార్ఖండ్‌ గవర్నర్‌పై ప్రతిపక్షాల మండిపాటు

రాంచీ : తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనుంది. పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలనే ఇడి అభ్యర్థనపై రాంచీలోని పిఎంఎల్‌ఎ కోర్టు గురువారం తీర్పు రిజర్వ్‌ చేసింది. దీంతో గురువారం ఆయన్ను ఇక్కడి హోత్వార్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. సోరేన్‌ను కోర్టు ముందుకు శుక్రవారం మరోసారి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత హేమంత్‌ను బుధశారం రాత్రి ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఏడు గంటలకు పైగా సోరేన్‌ను ఇడి విచారించింది. అవినీతి చర్యలు, అధికారాన్ని దుర్వినియోగం పర్చడం ద్వారా రాంచీలో సుమారు 8.5 ఎకరాల భూమి, ఇతర ఆస్తులను సంపాదించారని ఇడి ఆరోపిస్తోంది.

గవర్నర్‌ను కలిసిన చంపాయ్ సోరేన్‌

జార్ఖండ్‌ గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ను జెఎంఎం శాసనసభా పక్ష నేత చంపారు సోరేర్‌ బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజభవన్‌లో కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. జార్ఖండ్‌లో గత 18 గంటల నుంచి ప్రభుత్వం లేదని, ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో జాప్యం చేయవద్దని కోరారు. హేమంత్‌ సోరేన్‌ తరువాత లెజిస్లేచర్‌ పార్టీ నేతగా జెఎంఎం ఎమ్మెల్యేలు చంపాయ్ ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్‌ను కలిసిన సమయంలో చంపారు వెంట కాంగ్రెస్‌ శాసససభా పక్ష నేత అలంగీర్‌ ఆలం, ఆర్‌జెడి ఎమ్మెల్యే సత్యానంద్‌ భోక్త, సిపిఐ (ఎంఎల్‌) వినోద్‌ సింగ్‌, ఎమ్మెల్యే ప్రదీప్‌ యాదవ్‌ ఉన్నారు. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్‌ అసెంబ్లీలో చంపాయ్ కు 47 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరిలో 16 మంది కాంగ్రెస్‌, ఒకరు ఆర్‌జెడి ఎమ్మెల్యే. రాష్ట్రంలో బిజెపికి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ నుంచి ఇంకా ఆహ్వానం రాకపోవడంతో తమ ఎమ్మెల్యేలను జార్ఖండ్‌ వెలుపలికి తరలించాలని జెఎంఎం, కాంగ్రెస్‌ భావిస్తున్నాయి. ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బీహార్‌లో గంటల్లోనే చేయించారు కదా ? జాప్యమెందుకు ?

జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా ఛాంపై సొరేన్‌తో ప్రమాణస్వీకారం చేయించడంలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగున ఉన్న బీహార్‌లో నితీష్‌ కుమార్‌తో ప్రమాణస్వీకారం చేయించడంలో ప్రదర్శించిన వేగం జార్ఖండ్‌లో ఎందుకు కన్పించడం లేదని ప్రశ్నించింది. కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వీ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ‘హేమంత్‌ సొరేన్‌ ఎన్‌డిఎలో చేరి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. బిజెపి వాషింగ్‌ మిషన్లో ఆయన శుభ్రపడే వారు. ప్రపంచంలోనే అత్యంత పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాన్ని మన దేశంలో బిజెపి స్థాపించింది. అక్కడ ఒకే ఒక అంశంపై పిహెచ్‌డిలు, పోస్ట్‌ డాక్టరేట్లు ఇస్తారు. అదేమంటే ఎన్నికైన ప్రభుత్వాలను ఎలా కూల్చేయాలి, ఎన్నికైన ప్రభుత్వాలను ఎలా మైనారిటీలో పడేయాలి, ఫిరాయింపుల్ని ఎలా ప్రోత్సహించాలి, ఈ చర్యలకు ఎలా ప్రేరణ కలిగించాలి అనేదే ఆ అంశం’ అని ఎద్దేవా చేశారు. హేమంత్‌ సొరేన్‌ రాజీనామా అనంతరం జార్ఖండ్‌పై అనేక గంటలుగా నిశ్శబ్దత నెలకొన్నదని మనుసింఘ్వీ చెప్పారు. శాసనసభలో అధికార పక్షానికి 47-48 మంది, ప్రతిపక్షానికి 33 లేదా 32 మంది ఉన్నారని స్పష్టమైందని గుర్తు చేశారు. అయినా గవర్నర్‌ ఇప్పటి వరకూ ఎందుకు చర్య తీసుకోలేదని నిలదీశారు. మెజారిటీ శాసనసభ్యులు మద్దతు లేఖలు ఇచ్చినప్పటికీ ఎందుకింత ఆలస్యం జరుగుతోందో అర్థం కావడం లేదని అన్నారు. ‘మీరు ప్రధాని లేదా హోం మంత్రి కార్యాలయం నుండి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా? లేక ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు జరపడం కోసం చూస్తున్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించేందుకు వేచి ఉన్నారా?’ అంటూ గవర్నర్‌పై మనుసింఘ్వి ప్రశ్నల వర్షం కురిపించారు.

➡️