ముందస్తు బెయిల్‌తో న్యాయం అందకుండా పోరాదు ! : సుప్రీం

న్యూఢిల్లీ : అనేక కేసుల్లో బెయిల్‌ ఒక నిబంధన అని, కానీ ముందస్తు బెయిల్‌ మాత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్‌ న్యాయం అందకుండాపోవడానికి దారి తీయరాదని, ముఖ్యంగా మహిళలపై జరిగిన తీవ్రమైన నేరాల్లో ఈ పరిస్థితి ఎదురుకాకూడదని పేర్కొంది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు న్యాయస్థానాలకు గల అధికారం అసాధారణమైనదని, అంతేకానీ ఎవరు అడిగితే వారికి ఇచ్చేది కాదని జస్టిస్‌ సి.టి.రవికుమార్‌, జస్టిస్‌ సంజరుకుమార్‌లతో కూడిన బెంచ్‌ పేర్కొంది. ప్రతి ఒక్క కేసులోనూ వాస్తవాలు, పరిస్థితులపై ఆధారపడి, కోర్టు విచక్షణాధికారంతో మంజూరు చేయాల్సిన అంశమని ఇటీవల ఒక తీర్పు సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బీహార్‌లో మహిళలపై దాడులు సహా తీవ్రమైన నేరాలకు పాల్పడి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ నిబంధనల కింద నమోదైన కేసుల్లోని వ్యక్తులు ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా వాటిని విచారించిన న్యాయస్థానం పై తీర్పునిచ్చింది. పాట్నా హైకోర్టు వారి ముందస్తు బెయిల్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది. దాంతో వారు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కూడా హైకోర్టు నిర్ణయాన్నే సమర్ధించింది. తీవ్రమైన నేరాల్లోని నిందితులకు ఇలా ముందస్తు బెయిల్‌ పేరుతో రక్షణ కల్పించేటప్పుడు న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. కొన్ని సందర్భాల్లో ఈ ముందస్తు బెయిల్‌ సాక్ష్యాధారాలు నాశనమవడానికి దారితీస్తుందని హెచ్చరించారు. అవాంఛనీయమైన అరెస్టులు జరుగుతాయనుకున్నపుడు వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించుకోవడానికి ఉద్దేశించిన తాత్కాలిక రక్షణే ఈ ముందస్తు బెయిల్‌ అని అన్నారు. అర్హమైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయరాదని చెప్పడం తమ తీర్పు ఉద్దేశ్యం కాదని జస్టిస్‌ రవికుమార్‌ తెలిపారు.

➡️