ఇజ్రాయిల్‌లో క్షిపణి దాడి : భారతీయుడు మృతి

అప్రమత్తంగా వుండాలంటూ భారత ఎంబసీ హెచ్చరిక

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌ దాడులకు ప్రతిగా లెబనాన్‌కి చెందిన హిజ్బుల్లాలు జరిపిన రాకెట్‌ దాడిలో భారతీయుడు ఒకరు మరణించినట్లు భారత్‌లోని ఇజ్రాయిల్‌ ఎంబసీ మంగళవారం తెలిపింది. ఉత్తర ఇజ్రాయిల్‌లో లెబనాన్‌ సరిహద్దుల్లో గల పళ్ళతోటలో ఈ దాడి చోటు చేసుకుంది. శతఘ్ని విధ్వంసక రాకెట్‌ దాడిలో మొత్తంగా ఏడుగురు గాయపడగా, వీరిలో థాయిలాండ్‌ జాతీయులు కూడా వున్నారని మీడియా వార్తలు తెలిపాయి. చనిపోయిన వ్యక్తిని కేరళలోని వాడి నివాసి అయిన నిబిన్‌ మాక్స్‌వెల్‌ (31)గా గుర్తించారు. నిబిన్‌కు భార్య, కుమార్తె వున్నారు.

వెళ్ళింది జనవరిలోనే

జనవరిలోనే నిబిన్‌ ఇజ్రాయిల్‌ వెళ్ళారని ఆయన కుటుంబం తెలిపింది. ఆయన సోదరుడు నివిన్‌ కూడా ఇజ్రాయిల్‌లోనే పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దుర్వార్త వార్తను కుటుంబానికి చేరింది. నిబిన్‌ ఒక పొలంలో పనిచేస్తున్నాడని ఆయన తండ్రి తెలిపారు. ఈ సంఘటనతో ఇజ్రాయిల్‌లో భద్రతా పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా వున్నాయో మరోసారి స్పష్టమైంది. ఇజ్రాయిల్‌ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే భారతీయులు అప్రమత్తంగా వుండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయిల్‌లోని భారత ఎంబసీ కోరింది.

➡️