2004 తీర్పును పరిశీలిస్తాం : సుప్రీంకోర్టు

Feb 7,2024 10:58 #2004, #judgment, #Supreme Court
  • ఎస్‌సి, ఎస్‌టిలను వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం

న్యూఢిల్లీ : ఎస్‌సి, ఎస్‌టి కోటాలో 50 శాతం సబ్‌ కోటా కల్పిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటుకు సంబంధించిన వాద ప్రతివాదాల్లో తాము ఇప్పుడు వెళ్లడం లేదని, దీనికి ముందు 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సి ఉందని సిజెఐ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తెలిపింది. 2010 చంఢగీఢ్‌ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం పిటీషన్‌తో సహా ఎస్‌సి, ఎస్‌టిల వర్గీకరణకు సంబంధించిన మొత్తం 23 పిటీషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారించింది. ఎస్‌సి కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు వాల్మీకీలు, మజభి సిక్కులకు తొలి ప్రాధానత్య ఇస్తూ ఎస్‌సి, బిసి (సర్వీసుల్లో రిజరేషన్‌) చట్టం 2006ను చంఢగీఢ్‌ హైకోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వర్సెస్‌ ఇవి చిన్నయ్య కేసు సందర్భంగా 2004లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ చట్టం ఉల్లంఘించడమే కాకుండా, రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును పంజాబ్‌ ప్రభుత్వం ఆశ్రయించింది. ఎస్‌సి, ఎస్‌టిల్లో వర్గీకరణ చేయకుండా రాష్ట్రాలను నిరోధించే అంశం రాజ్యాంగంలో లేదని పంజాబ్‌ ప్రభుత్వం తన పిటీషన్‌లో పేర్కొంది. పంజాబ్‌ వాదనలను విన్న సిజెఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సి ఉందని తెలిపింది. దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

➡️