LS Polls 6th Phase : ఆరో విడతలో 61.46 శాతం పోలింగ్‌

  • ఓటేేసిన పలువురు ప్రముఖులు
  •  543 లోక్‌సభ స్థానాలకు గాను 90 శాతం స్థానాల్లో ఎన్నికలు పూర్తి
  • మిగిలిన 57 సీట్లకు
  • 1న ఆఖరి విడత పోలింగ్‌
  • 4న ఓట్ల లెక్కింపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ శనివారం చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా జరిగింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 58 లోక్‌సభ స్థానాలకు, అలాగే ఒరిస్సాలో అసెంబ్లీ స్థానాలకు శనివారం నిర్వహించిన పోలింగ్‌లో కడపటి వార్తలందేసరికి 59.06 శాతం ఓట్లు పోలయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం, రాత్రి 7.45 గంటల సమయానికి పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 78 శాతం ఓట్లు పోల్‌ కాగా, బీహార్‌లో అత్యల్పంగా 53.19 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.జార్ఖండ్‌్‌లో 62.66 శాతం, ఒరిస్సాలో 59.92 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 54.03 శాతం, ఢిల్లీలో 54.37 శాతం, హర్యానాలో 58.24 శాతం ఓట్లు పోలయ్యాయి. జమ్మూకాశ్మీర్‌ లోని అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలో 51 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 90 శాతం సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మిగిలి వున్న 57 స్థానాలకు జూన్‌1న ఆఖరి విడత పోలింగ్‌ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్‌4న చేపడతారు. మోడీ ప్రభుత్వం మూడవ సారి అధికారం చేజిక్కించుకోవడం అసాధ్యమని ఆరు దశల్లో తగ్గిన పోలింగ్‌ సరళిని బట్టి విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా చేపట్టిన ఘనత స్వాతంత్య్రానంతర భారత దేశ చరిత్రలో ఒక్కరికే దక్కింది. అదే తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో పది శాతం దాకా ఉన్నారన్నమాట. పోలింగ్‌ శాతం ఈ ఆరు విడతల్లో సగటున 62 శాతం నుంచి 69 శాతం మధ్య పోలింగ్‌ జరిగింది. భగభగమంటున్న ఎండల మధ్య పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లు ఓపికగా బారులు తీరారు.

 

 

➡️