మార్చిలో విచారణ చేపడతాం : మొయిత్రా పిటిషన్‌పై సుప్రీంకోర్టు

 న్యూఢిల్లీ :   పార్లమెంటు నుండి తన బహిష్కరణను సవాలు చేస్తూ టిఎంసి నేత మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చనప్పటికీ.. ఈ అంశాన్ని విచారించే అధికార పరిధి తమకు ఉందో లేదో మొదట నిర్థారించాల్సి వుందని కోర్టు పేర్కొంది. వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్‌ సెషన్‌ను పేర్కొంటూ.. ముందస్తు విచారణ చేపట్టాలన్న మొయిత్రా అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఈ అంశంపై స్పందించేందుకు లోక్‌సభ సెక్రటేరియట్‌కు  మూడు వారాల గడువు  ఇచ్చింది. మార్చి 11నుండి మళ్లీ సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభిస్తామని తెలిపింది. పిటిషన్‌లో మొయిత్రా లేవనెత్తిన అంశాలపై వ్యాఖ్యానించబోదని, అయితే కేసు పరిశీలనలో ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

అయితే పార్లమెంటు లోపల తీసుకున్న నిర్ణయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని లోక్‌సభ సెక్రటేరియట్‌ తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. ”మాకు న్యాయ సమీక్ష అధికారం ఉంటే దర్యాప్తు చేపడుతుంది” అని సుప్రీంకోర్టు లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విచారణ సమయంలో .. ”హీరానందానితో మీ పార్లమెంట్‌ లాగిన్‌ ఒటిపిని ఇచ్చారనడాన్ని మీరు అంగీకరిస్తారా ” అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎంపిలందరూ తమ సెక్రటరీలకు ఇస్తారని మొయిత్రా తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ తెలిపారు.

➡️