Manipur: సిఆర్‌పిఎఫ్‌ సైనికులను కిందకు దించి బస్సును దగ్ధం చేసిన దుండగులు

Jun 18,2024 23:16 #bus, #CRPF Soldiers, #Manipur, #soldiers

ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయుధ దుండగులు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా సిఆర్‌పిఎఫ్‌ జవాన్లతో వెళుతున్న బస్సును అడ్డగించిన దుండగులు బస్సులో ఉన్న జవాన్లందర్నీ కిందకు దిగమని చెప్పి తరువాత బస్సును దగ్ధం చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కాంగ్పోక్పి పోలీసుస్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. ఇది ఒక అద్దె బస్సు అని, సిఆర్‌పిఎఫ్‌ జవాన్లతో ఈ బస్సు ప్రయాణం చేస్తుందని పోలీసులు చెప్పారు. గతవారం బిష్ణుపూర్‌ జిల్లాలో రెండు ట్రక్కులను దగ్ధం చేసినందుకు ప్రతీకారంగా ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మణిపూర్‌లో గత ఏడాది మే నుంచి హింసాకాండ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో ఇప్పటివరకూ 220 మంది మరణించగా, 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

➡️