సస్పెండ్‌ చేసిన అధికారులను తిరిగి నియమించండి

Jan 17,2024 10:57 #Amit Shah, #Manipur
  • అమిత్‌ షాకు మణిపూర్‌ గిరిజన ఎమ్మెల్యేల లేఖ

ఇంఫాల్‌ : పాఠశాలలకు సాయం చేశారన్న ఆరోపణపై సస్పెండ్‌ చేసిన ముగ్గురు అధికారులను తిరిగి నియమించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని మణిపూర్‌కు చెందిన గిరిజన ఎమ్మెల్యేలు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కోరారు. ఈ మేరకు వారు ఆయనకు ఓ లేఖ రాశారు. చురాచాంద్‌పూర్‌, కాంగ్‌పోక్‌పీ జిల్లాలలోని 26 పాఠశాలలకు సిబిఎస్‌ఇ అఫిలియేషన్‌ రావడంలో సాయం చేశారన్న కారణంతో ఈ ముగ్గురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఏడుగురు బిజెపి ఎమ్మెల్యేలు సహా మొత్తం పది మంది శాసనసభ్యులు అమిత్‌కు లేఖ రాశారు. మణిపూర్‌ విద్యా శాఖలో పనిచేస్తున్న కుకీ-జోమీ తెగకు చెందిన అధికారులను సస్పెండ్‌ చేశారని తెలిసిందని వారు ఆ లేఖలో తెలియజేశారు. మణిపూర్‌లో హింసాకాండ తలెత్తడంతో ఆయా పాఠశాలలు సిబిఎస్‌ఇ గుర్తింపు పొందేందుకు వీలుగా అధికారులు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు జారీ చేశారని వివరించారు. ఈ పాఠశాలలకు సాధ్యమైనంత త్వరగా సిబిఎస్‌ఇ గుర్తింపును పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు రాష్ట్ర విద్యా మంత్రి బసంత్‌ కుమార్‌ అందుబాటులో లేరు. కాగా పాఠశాలలకు సర్టిఫికెట్లు జారీ చేసిన ఉదంతంపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అర్హత కలిగిన అధికారులు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో పాఠశాలల గుర్తింపును సిబిఎస్‌ఇ ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని కూడా గిరిజన ఎమ్మెల్యేలు తమ లేఖలో ప్రస్తావించారు.

➡️