Mann ki Baat : తిరిగి ప్రారంభమైన ప్రధాని ప్రసంగం

Jun 30,2024 13:46 #2024 elections, #Mann Ki Baat, #PM Modi

న్యూఢిల్లీ  :   2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తిరిగి ప్రధాని మోడీ ఆదివారం ‘మన్‌కీ బాత్‌’లో ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా ప్రజలు రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకున్న అచంచల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రసారానికి బ్రేక్‌ పడింది.

2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరగలేదని, 65కోట్లకు పైగా ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్‌తో పాటు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ చెట్లను నాటడం ప్రారంభించాలని అన్నారు.  తమ తల్లుల చిత్రాలను పంచుకోవడం ద్వారా ఇతరులకు ప్రేరణ కల్పించడం చూసి తాను సంతోషిస్తున్నానని అన్నారు.

1857లో మొదటి స్వాతంత్య్ర సమరానికి ముందు 1855లో బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా సంతాల్‌ తిరుగుబాటుకు నేతృత్వం వహించిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధులు వీర్‌ సిద్ధు, కన్హులకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. వచ్చే నెలలో జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న  భారత క్రీడాకారులను అభినందించారు. భారత అథ్లెట్లు 900కు పైగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారని  పేర్కొన్నారు.

➡️