ఛత్తీస్‌గఢ్‌లో మరో ఘాతుకం

Apr 30,2024 23:30 #Chhattisgarh, #encounter
  •  ముగ్గురు మహిళలతో సహా 10 మంది నక్సల్స్‌ కాల్చివేత
  •  15 రోజుల వ్యవధిలో రెండో భారీ ‘ఎన్‌కౌంటర్‌’
  •  ఈ ఏడాది ఇప్పటివరకు 91 మంది చనిపోయారు

నారాయణపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతం మరోసారి నెత్తురు చిందించింది. నారాయణపూర్‌-కాంకేర్‌ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంపై భద్రతా బలగాలు మంగళవారం తెల్లవారు జామున మెరుపు దాడి చేసి ముగ్గురు మహిళలతో సహా పది మంది నక్పలైట్లను కాల్చి చంపారు. 15 రోజుల వ్యవధిలో జరిగిన రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా దీనిని పోలీస్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది భద్రతా బలగాలు సాధించిన మరో అతి పెద్ద విజయమని ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16న కంకెర్‌ జిల్లాలోని కల్పెర్‌ గ్రామంలో భద్రతా దళాల కాల్పుల్లో 29 మంది నక్సలైట్లు చనిపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ‘ఎన్‌కౌంటర్‌’ జరిగినట్లుగా చెప్పబడుతున్న ప్రాంతం కల్పెర్‌ గ్రామానికి దక్షిణంగా సుమారు 30 కిలోమీటర్లు దూరంలోనే ఉంది. అబూజ్మడ్‌ ప్రాంతంలోని టెక్మెత, కకూర్‌ గ్రామాల మధ్య ఉన్న అడవిలో నక్సలైట్ల కదలికల గురించి పక్కా సమాచారం ఉండడంతో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తుపాకీ గుళ్ల వర్సం కురిపించాయి. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల వద్ద ఒక ఎకె-47 రైఫిల్‌, ఒక ఐఎన్‌ఎస్‌ఎఎస్‌ రైఫిల్‌, ఇతర ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, పేలుడు పదారాలు దొరికాయని పోలీసులు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని చెప్పారు. అలాగే నక్సలైట్లను చర్చలకు ఆహ్వానిస్తున్నామని, అన్నారు. నక్సలైట్లు వ్యక్తిగతంగా కానీ, గ్రూపులుగా కానీ వీడియో కాల్‌ లేదా మధ్యవర్తి ద్వారా సంప్రదించవచ్చని అన్నారు. బస్తర్‌లో శాంతి నెలకొనాలని, అభివృద్ధి చెందాలని మేం కోరుకుంటున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి సెలవిచ్చారు.

➡️