మోడీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం

  •  ఇసికి కాంగ్రెస్‌ ఫిర్యాదు
  •  మరో అయిదు అంశాలపై కూడా..

న్యూఢిల్లీ : తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోల్చుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సోమవారం ఫిర్యాదు చేసింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సల్మాన్‌ ఖుర్షిద్‌, పవన్‌ ఖేరా, ముకుల్‌ వాస్నిక్‌, గురుదీప్‌ సపాల్‌తో కూడిన ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికలసంఘం అధికారిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు. యూనివర్సిటీల్లో ప్రధాని మోడీ హోర్డింగ్‌లు ప్రదర్శించడం, ఎన్నికల ప్రచారంలో సాయుధ బలగాలను వినియోగించడం, కేంద్ర మంత్రి, తిరువనంతపురం బిజెపి అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌, మరి కొందరు బిజెపిఅభ్యర్థులు దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్ల గురించి మొత్తం ఆరు అంశాలపై వారు ఫిర్యాదు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ షహరాన్‌పూర్‌లో ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక స్వాతంత్య్రానికి ముందు జిన్నా ముస్లిం లీగ్‌ ఏ భావజాలాన్ని కలిగివున్నారో వాటినే రుద్దేదిగా ఉందని, దేశాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోందంటూ నోరు పారేసుకున్నారు. మ్యానిఫెస్టోలో రెండో భాగం కమ్యూనిస్టులు, వామపక్షాల ఆలోచనల ప్రాబల్యం ఉందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీల్లో ప్రధాని మోడీ ఫోటోలు, పెద్ద పెద్ద కటౌట్లు ప్రదర్శించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్‌ పేర్కొంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఇసిని కోరింది. ఇసి అధికారులతో భేటీ అనంతరం కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖెరా మాట్లాడుతూ, ఆరు అంశాలపై ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేశామని, వీటిలో రెండు ఫిర్యాదులు ప్రధాని మోడీ, బిజెపి చేసిన వ్యాఖ్యలకు సంబంధించినవేనని తెలిపారు. మిలటరీ యూనిఫారంలో వున్న ప్రధాని ఫోటోలను ఎన్నికల ప్రచారం సందర్భంగా వాడడం ఎన్నికల నిబంధనావళికి విరుద్ధమన్నారు. ఢిల్లీ వర్శిటీకి చెందిన వివిధ కాలేజీల్లో ”వికసిత్‌ భారత్‌ ఎట్‌ 2047 : వాయిస్‌ ఆఫ్‌ యూత క్యాంపెయిన్‌” బ్యానర్‌ కింద ప్రధాని నిలువెత్తు బ్యానర్లు, కటౌట్లను పెట్టడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా నిరసించింది. ప్రభుత్వ నిధులతో పెట్టే హోర్డింగ్‌లను రాజకీయ పార్టీలు ఉపయోగించుకోరాదని పేర్కొంది. అలాగే మంత్రులు, ఇతర రాజకీయ నేతల ఫోటోలు కాలేజీలు, ప్రభుత్వ భవనాల ఆవరణలో వుండరాదని పేర్కొంది. కేరళ స్టోరీ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న దూరదర్శన్‌లో ప్రసారం చేయడాన్ని ఖండిస్తూ ఇచ్చిన ఫిర్యాదును కూడా ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ప్రధాని మోడీపైన, బిజెపి పైన చర్య తీసుకోవాలని ఇసిని తాము కోరినట్లు చెప్పారు.

➡️