కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డిఎస్‌ కన్నుమూత

-రేపు అధికార లాంఛనాలతో నిజామాబాద్‌లో అంత్యక్రియలు
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్‌ (డిఎస్‌) (76) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. డిఎస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం నిజామాబాద్‌ ఎంపిగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజరు గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్‌ నేత డిఎస్‌ అంత్యక్రియలు అధికారలాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డిఎస్‌ మరణం పట్ల సిఎం రేవంత్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు నివాళులర్పించారు. భౌతికకాయంపై కాంగ్రెస్‌ జెండా కప్పారు. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు.
1948 సెప్టెంబర్‌ 27న జన్మించిన డిఎస్‌.. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగారు. నిజామాబాద్‌ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్‌ పిఆర్‌ మంత్రిగా.. 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బిఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు.

➡️