SCO: షాంఘై సదస్సులో మోడీ పాల్గొనడం లేదు

ఢిల్లీ : ప్రధాని మంత్రి మోడీ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం లేదు. వచ్చే వారం కజకిస్థాన్‌ రాజధాని అస్తానాలో జరగనున్న ఈ సదస్సులో భారత్ తరుపున విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొననున్నారు. జులై 8, 9 తేదీలలో 5 ఏళ్ల తరువాత రష్యాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రష్యా పర్యటన అనంతపురం ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఈ రెండు దేశాల పర్యటనల కారణంగా ఎస్.సి.ఓ సదస్సుకు హాజరుకావడం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు దేశాల పర్యటనపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. జులై 3, 4 తేదీలలో జరుగు ఎస్.సి.ఓ సదస్సు ప్రాంతీయ భద్రతా పరిస్థితి, కనెక్టివిటీ మరియు వాణిజ్యాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెడుతుందని భావిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “ఎస్.సి.ఓ సమ్మిట్‌లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి జైశంకర్ నాయకత్వం వహిస్తారు” అని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితి, ఉక్రెయిన్ వివాదం మరియు ఎస్.సి.ఓ సభ్య దేశాల మధ్య మొత్తం భద్రతా సహకారాన్ని పెంచడం ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చించనున్నారని భావిస్తున్నారు. భారతదేశం, చైనా, రష్యా, పాకిస్థాన్, కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌లతో కూడిన ఎస్.సి.ఓ ఒక ప్రభావవంతమైన ఆర్థిక, భద్రతా కూటమిగా ఉంది. అంతర్జాతీయ సంస్థలలో ఇది అతిపెద్ద ప్రాంతీయ కూటమిగా ఉద్భవించింది.
రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్థాన్ మరియు ఉజ్బెకిస్థాన్ అధ్యక్షులచే 2001లో షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఎస్.సి.ఓ స్థాపించబడింది. 2017లో భారత్‌తోపాటు పాకిస్థాన్ శాశ్వత సభ్యత్వం పొందింది.

➡️