ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంపు 

Dec 28,2023 09:08 #Union Cabinet
msp for dry coconut
  • ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎండు కొబ్బరికి 2024 సీజన్‌లో చెల్లించే కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొబ్బరి నూనె తయారు చేయడానికి ఉపయోగించే ఎండు కొబ్బరికి 2024 సీజన్‌లో క్వింటాల్‌కు రూ.11,160 కనీస ధరగా నిర్ణయించారు. కురిడి కొబ్బరి కాయకు చెల్లించే కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.12 వేలుగా నిర్ణయించారు. గత సీజన్‌ కంటే మిల్లింగ్‌ కొబ్బరి క్వింటాల్‌కు రూ.300, బాల్‌ (గుండ్రని) కొబ్బరికి రూ.250ల చొప్పున పెంపునకు ఆమోదం తెలిపారు. దీంతో ఎండు కొబ్బరి (మిల్లింగ్‌) క్వింటాల్‌ ధర రూ.11,160, ఎండుకొబ్బరి (బాల్‌) ధర రూ.12వేలకు చేరుకుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు నూనె తీయడానికి ఉపయోగించే కొబ్బరిపై 51.84 శాతం, కురిడిపై 63.26 శాతం మార్జిన్‌ లభిస్తుంది. జాతీయ స్థాయిలో నిర్ణయించిన వెయిటెడ్‌ ఉత్పత్తి వ్యయంతో పోల్చి చూస్తే ఇది1.5 రెట్లు ఎక్కువ. అలాగే, బీహార్‌లోని దిఘా, సోనేపూర్‌లను కలుపుతూ గంగా నదిపై కొత్త 4.56 కిలో మీటర్ల పొడవు ఆరు-లేన్‌ వంతెన నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, త్రిపురలోని ఖోవాయి-హరీనా రహదారిని 135 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

➡️