NEET issue : సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలి : కాంగ్రెస్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ : నీట్‌  కుంభకోణంపై  సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని  కాంగ్రెస్‌ గురువారం మరోసారి డిమాండ్‌ చేసింది.  నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టిఎ) డైరెక్టర్‌ జనరల్‌ని తొలగించాలని పునరుద్ఘాటించింది. ఈ అంశంపై దేశ ప్రజల్లో ఉన్న ఆగ్రహం పార్లమెంటులో కూడా ప్రతిధ్వనిస్తుందని కాంగ్రెస్‌ హెచ్చరించింది. నీట్‌ పరీక్ష వివాదంపై విచారణ చేపట్టాలన్న దేశవ్యాప్త డిమాండ్‌పై మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధ్యతా రాహిత్యం మరియు అవివేకమని మండిపడింది.

గ్రేస్‌ మార్కులు ఒక్కటే సమస్య కాదని, నీట్‌ పరీక్షల్లో రిగ్గింగ్‌ జరిగిందని, ప్రశ్నాపత్రం లీకైందని, అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వ చర్యల కారణంగా 24 లక్షల మంది నీట్‌ అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా మోడీ ప్రభుత్వం రిగ్గింగ్‌, పేపర్‌ లీక్‌లతో కోట్లాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. ఎగ్జామ్‌ సెంటర్‌, కోచింగ్‌ సెంటర్‌ల మధ్య సంబంధం ఏర్పడిందని, దీంతో నగదు చెల్లించు, ప్రశ్నాపత్రం తీసుకో అనే గేమ్‌ ఆడుతున్నారని అన్నారు.

మోడీ ప్రభుత్వం తన చర్యల పరిణామాలను ఎన్‌టిఎ భుజాలపై పడేసి, బాధ్యతల నుండి తప్పించుకోలేదని అన్నారు. నీట్‌ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరపాలని ఉద్ఘాటించారు. ఒకవేళ సిబిఐ విచారణకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే , సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయమైన విచారణ జరిపించాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌కు కట్టుబడి ఉండాలని ఖర్గే పునరుద్ఘాటించారు.

➡️