నీట్‌ స్కామ్‌పై నిగ్గు తేల్చాలి

Jun 10,2024 23:59 #dhrana, #SFI
  • అవకతవకలపై దర్యాప్తు చేయాలి
  • కేంద్ర విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) కుంభకోణంపై నిగ్గు తేల్చాలని ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు ఐషీ ఘోష్‌, మయాంక్‌ డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్‌ పరీక్షల నిర్వహణలో అసమర్థత ప్రదర్శిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఆందోళన జరిగింది. హైదరాబాద్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడులోని చెన్నైలో ఆందోళనలు జరిగాయి. ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు ఐషీ ఘోష్‌, మయాంక్‌ మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించాల్సిన ఎన్‌టిఎ సామ ర్థ్యం సరిగ్గా లేదని, ఇటీవలి నీట్‌ స్కామ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సియుఇటి)లో పేపర్‌ లీక్‌లతో సహా ఏజెన్సీ చుట్టూ ఉన్న వివాదాలు ఉన్నాయని విమర్శించారు. ఈ ఘటనలు విద్యార్థుల్లో తీవ్ర ఒత్తిడిని, ఆందోళనకు గురిచేయడమే కాకుండా వారి భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేశాయని పేర్కొన్నారు. సురక్షితమైన పరీక్షలను నిర్వహించడంలో ఎన్‌టిఎ పదేపదే విఫలమవుతున్నందున దానిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నిష్పక్షపాతమైన, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలన్నారు. అసంఖ్యాక విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, ఈ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర విద్యాశాఖ తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
జెఎన్‌యు ఎస్‌యు ఉపాధ్యక్షులు అవిజిత్‌ ఘోష్‌ మాట్లాడుతూ ‘జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి నీట్‌ పరీక్షలో ఆరోపించిన అవకతవకలపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడేందుకు మరింత విశ్వసనీయమైన, సురక్షితమైన పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేయాలని మేము కేంద్ర విద్యాశాఖను డిమాండ్‌ చేస్తున్నాం’ అని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ జాయింట్‌ సెక్రటరీ సూరజ్‌ ఎలామన్‌ మాట్లాడుతూ.. ‘పదేపదే, ఎన్‌టిఎ పరీక్షల నిర్వహణలో లోపభూయిష్ట పద్ధతులతో విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది. ఇటీవలి సియుఇటి పరీక్షల మధ్య కూడా పరీక్షా కేంద్రాల వద్ద జరిగిన వివిధ వ్యత్యాసాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అప్పుడు తగిన చర్యలు తీసుకోలేదు. ఎన్‌టిఎ అవకతవకలు లేకుండా పరీక్షలను నిర్ధారించలేని అసమర్థ సంస్థగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఎన్‌టిఎని రద్దు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

➡️