నేడు నితీష్‌ రాజీనామా !

Jan 28,2024 09:06 #Nitish Kumar, #resignation, #today
  • ఆ వెంటనే బిజెపి మద్దతుతో మళ్లీ సిఎంగా ప్రమాణం

పాట్నా: బీహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ ఆదివారం ఉదయం తన పదవికి రాజీనామా చేస్తారని, ఆ వెంటనే బిజెపి దన్నుతో తిరిగి తొమ్మిదోసారి సిఎంగా ప్రమాణం చేస్తారని ఆయనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఒకరు పిటిఐకి తెలిపారు. రాజీనామా లేఖను గవర్నరుకు సమర్పించే ముందు నితీష్‌ లాంఛనంగా జెడి(యు) లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం సెలవు రోజైనప్పటికీ ఆదివారం రాష్ట్ర సచివాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. నితీష్‌ బిజెపితో వెళితే అంతకన్నా రాజకీయ దివాళాకోరుతనం ఇంకొకటి ఉండదని కాంగ్రెస్‌ నాయకుడు హరీష్‌ రావత్‌ హెచ్చరించారు. నితీష్‌ బిజెపి పంచన చేరేందుకు అంతా సిద్ధం చేసుకోవడంతో ఆర్‌జెడి లెజిస్లేచర్‌ పార్టీ శనివారం నాడిక్కడ అత్యవసరంగా సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించింది. పరిస్థితిని బట్టి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అప్పగిస్తూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రస్తుతానికి నితీష్‌కు మద్దతు ఉపసంహరించుకునే ఎలాంటి వైఖరి తీసుకోలేదని ఆర్‌జెడి ప్రతినిధి మనోజ్‌ ఝా మీడియాకు చెప్పారు. మరో వైపు బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశమై ప్రస్తుత రాజకీయ డ్రామాకు తెరదించేందుకు కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను తు.చ తప్పక పాటించాలని నిర్ణయించారు. గతసారి బీహార్‌ నుంచి 17 లోక్‌సభ స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఈసారి బిజెపికి సీట్లు బాగా తగ్గనున్నాయని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలడంతో నితీష్‌ను మళ్లీ తనవైపు తిప్పుకునేందుకు బిజెపి సరికొత్త డ్రామాకు తెరతీసింది. జెడి (యు) క్షీణత ఇప్పటికే మొదలైందని, బిజెపితో జత కలిస్తే ఉన్నది కూడా ఊడిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2015 ఎన్నికల్లో 71 అసెంబ్లీ స్థానాలున్న జెడి (యు) 2020 ఎన్నికల్లో బిజెపితో కలసి పోటీ చేయడం వల్ల 43 స్థానాలకు పడిపోయింది. అదే సమయంలో బిజెపి తన బలాన్ని 53 నుంచి 74 స్థానాలకు పెంచుకుంది. బీహార్‌లో ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీల బలాబలాల పొందికను బట్టి చూస్తే 243 స్థానాలున్న రాష్ట్ర ఆసెంబ్లీలో నితీష్‌ నేతృత్వంలోని జెడి(యు)కి 45, బిజెపికి 78, ఆర్‌జెడికి 79, కాంగ్రెస్‌కు 19, సిపిఐ(ఎంఎల్‌)కు 19, సిపిఎంకు 2, సిపిఐకి 2 సీట్లు ఉన్నాయి. ఇండిపెండెంటు ఒకరు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌- 122. జెడి(యు), ఎన్డీయే పంచన చేరితే ఆ కూటమి బలం 123కు చేరుతుంది.

➡️