ముస్లింలకు నో ఛాన్స్‌

Jun 11,2024 08:05 #muslim, #Parlament
  • ఈసారి ఎన్‌డిఎ మిత్రపక్షాల నుంచీ ఎంపీగా ఎన్నిక కాని ముస్లిం అభ్యర్థులు

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అండ్‌ టీం ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం ముగిసింది. అయితే, ఇందులో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేడు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా మంత్రిగా ప్రమాణం చేయకపోవడం బహుశా ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిజెపి నాయకుడు ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాజ్యసభకు తిరిగి ఎన్నిక కాకపోవటంతో పాత మంత్రివర్గంలోనూ ముస్లిం మంత్రి లేరని వారు గుర్తు చేస్తున్నారు. సాధారణంగా.. ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి మండలి కూర్పులో కనీసం ఒక ముస్లిం ఎంపీ ఉంటారు. 2014లో ప్రధాని మోడీ తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నజ్మా హెప్తుల్లా మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ప్రమాణస్వీకారం చేసి మైనారిటీ వ్యవహారాల మంత్రి అయ్యారు.
18వ లోక్‌సభకు ఎన్‌డిఎ మిత్రపక్షాల నుంచి ముస్లిం అభ్యర్థి ఎవరూ ఎన్నిక కాకపోవటం కూడా ఈ మంత్రి మండలిలో ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవడానికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దిగువ సభకు ఎన్నికైన 24 మంది ముస్లిం ఎంపీలలో ఇండియా వేదికలో(టిఎంసితో కలుపుకుంటే), ఎంఐఎంకు చెందినవారున్నారు. ఇందులో స్వతంత్రులూ ఉన్నారు.
2004, 2009లో యూపీఏ రెండు దఫాల్లో మంత్రి మండలిలో వరుసగా నలుగురు, ఐదుగురు ముస్లిం ఎంపీలు ఉన్నారు. 1999లో కూడా, అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలోని మంత్రి మండలిలో ఇద్దరు ముస్లింలు షానవాజ్‌ హుస్సేన్‌, ఒమర్‌ అబ్దుల్లాలు మంత్రులుగా ఎంపికయ్యారు. 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మంత్రిగా పని చేశారు.

➡️