ఎదురుకాల్పులు కాదు..వేటాడి చేస్తున్న హత్యలు

May 12,2024 09:48 #chattisghad, #Hunting killings

– దండకారణ్యంలో భద్రతా దళాల దాష్టీకాలు
-అడవులను జల్లెడబట్టి కాల్చివేతలు
– పౌర సంఘాల నేతలు ఆందోళన
ఛత్తీస్‌గఢ్‌/హైదరాబాద్‌ : దండకారణ్యం ఇటీవల కాలంలో నిత్యం రక్తమోడుతూనేవుంది. కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి మావోయిస్టులను ఏరివేస్తున్నారు. పదుల సంఖ్యలో మావోయిస్టులు నెలకొరిగారు. బీజాపుర్‌లో పిడియా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు చనిపోతే..ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ఇది భద్రతాబలగాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 100 మంది పైగా మావోయిస్టులు ఇలా ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అయితే ఇవి ఎదురుకాల్పులు కానేకాదని, భద్రతాబలగాలే అటవీప్రాంతంలోకి చొరబడి వెంటాడివేటాడి చేస్తున్న హత్యలు అని పలు పౌర సంఘాలు, మావన హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పక్కా ప్రణాళికతో ఏరివేత
దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత భద్రత బలగాల పక్కా ప్రణాళికతోనే సాగుతోంది. ఏ చిన్నపాటి సమాచారం అందినా భారీ స్థాయిలో బలగాలను రంగంలోకి దింపి మావోయిస్టులను చంపేస్తున్నారు. బీజాపుర్‌ జిల్లాలో పిడియా గ్రామం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ పక్కా వ్యూహాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి జవాన్లను రప్పించారు. మావోయిస్టులను చుట్టుముట్టి దాడి చేశారు. పిడియా సమీపంలోని అడవిలో మావోయిస్టు కీలక నాయకులు సహా దాదాపు 150 మంది కేడర్‌ మకాం వేసినట్లు భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కోబ్రా, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, బీజాపుర్‌, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోని డిఆర్‌జి దళాలను అప్రమత్తం చేసి అందరినీ రప్పించారు. దాదాపు 1,000 మంది జవాన్లు పిడియా సమీపంలో అడవిలోకి చేరుకొన్నారు. మావోయిస్టులు కనిపించగానే కాల్పుల మోత మోగించారు. అయితే మావోయిస్టులే మొదట కాల్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 11 గంటలపాటు అడవిలో వేర్వేరుచోట్ల భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతంలోనే బస్తర్‌ డివిజన్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు పాపారావ్‌, దర్భా డివిజన్‌ ఎస్‌జిసి చిట్టీ, పిఎల్‌జిఎ కంపెనీ నెంబర్‌-2 కమాండర్‌ల్లా , గంగలూరు ఏరియా కమిటీ ప్లాటూన్‌కు చెందిన దినేష్‌ మోడియం వంటి మావోయిస్టు దళ నాయకులు మకాం వేసివుంటారని తెలిసింది. అయితే ఈ ఎన్‌కౌంటర్లో చనిపోయిన 12 మందిలో నాయకత్వ స్థాయి మావోయిస్టులు ఎవ్వరూ లేరని అధికారులు ప్రకటించారు.
ఎన్నికల వేళ..కాల్పుల మోత
సార్వత్రిక ఎన్నికల వేళ భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇటీవల ఏప్రిల్‌ 3న జరిగిన కాంకేర్‌ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 29 మంది మావోయిస్టులను చంపేశారు. వాస్తవానికి ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌. ఆ తర్వాత నారాయణ్‌పుర్‌ వద్ద మరో 10 మంది మావోయిస్టులను చంపేశారు. తాజాగా పడియా వద్ద మరో 12 మందిని ఎన్‌కౌంటర్‌ చేశారు.
మావోయిస్టు కోటపై దృష్టి
దేశంలో చాలా రాష్ట్రాల్లో మావోయిస్టులను అణచివేస్తున్నా.. ఒక్క ఛత్తీస్‌గడ్‌లో మాత్రం అది చాలా ఏళ్లు సాధ్యం కాలేదు. ఇక్కడున్న మొత్తం 27 జిల్లాల్లో 18 చోట్ల మావోయిస్టులకు పట్టు ఉంది. దంతెవాడ, బీజాపుర్‌, నారాయణ్‌పుర్‌, బస్తర్‌, కాంకేర్‌ వంటి ప్రాంతాలు వారికి బలమైనవి. ఇక 2010లో 76 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల హత్య, 2013లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అగ్రనాయకులను చంపడంతో ఛత్తీస్‌గడ్‌ వణికిపోయింది. ఈ పరిణామాలతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. వివాదాస్పద సల్వాజుడుంను పక్కనపెట్టి..నేరుగా భద్రతా బలగాలను రంగంలోకి దింపాయి. ముఖ్యంగా ఆంధ్రాకు చెందిన గ్రేహౌండ్స్‌ నమూనాలో కోబ్రా దళాలను సిద్ధం చేశాయి. అంతేకాదు.. మావోయిస్టుల సమాచారం ఇస్తే భారీగా నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగాలు ఇస్తామంటూ స్థానిక ప్రజానీకానికి భద్రతాబలగాలు ఎరలు వేశాయి. మరోవైపు స్థానిక యువతతో ఏర్పాటుచేసిన ‘బస్తరియా బెటాలియన్‌’ మావోయిస్టులను ఏరివేయడంలో ఉపయోగపడుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. మహిళా మావోయిస్టులతో పోరాటానికి వీలుగా బస్తరియా బెటాలియన్‌ మహిళా దళాలకు శిక్షణ ఇచ్చారు.
దండకారణ్యంలో దళాల పాగా
ఛత్తీస్‌గడ్‌లోని దండకారణ్యాన్ని చీల్చుకొంటూ భద్రతా బలగాలు వెళ్లేలా రహదారులను నిర్మించడం కూడా మావోయిస్టుల ఉనికిని కనుమరుగు చేసేందుకు కలిసొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సుక్మా, బీజాపుర్‌, జగదల్‌పుర్‌లో 11 ముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో మావోయిస్టుల ఆనుపానులు సులువుగా తెలుస్తున్నాయి. పల్లి-బార్సుర్‌ రహదారి పూర్తికావడంతో భద్రతా దళాలు బోద్లి, ఖేడామెటా ప్రాంతాలకు చేరుకొనేందుకు సులువైన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చిక్కటి అటవీ ప్రాంతాల్లో కూడా భద్రత బలగాలు క్యాంపులు ఏర్పాటుచేసుకొంటున్నాయి. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ లోపు సుక్మా-బీజాపుర్‌ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌ 20 క్యాంపులను ఏర్పాటుచేసిందంటే వారి దూకుడును అర్థం చేసుకోవచ్చు. కాంకేర్‌లో బిఎస్‌ఎఫ్‌ మూడు క్యాంపులు ఏర్పాటుచేసింది. మావోయిస్టుల నాయకుడు హిడ్మాకు పట్టున్న ప్రాంతంగా పేరున్న పువర్తి గ్రామంలోనే ఏకంగా పోలీస్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. ఇవి ఇప్పుడు అబూర్‌aమాడ్‌ అడవులకు కూడా విస్తరించాయి. తాజాగా ఎన్నికలు రావడం, సాధారణంగా ఎండాకాలంలో అడవుల్లో కూంబింగ్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో భద్రతా దళాలు అడవుల్లోకి చొచ్చుకెళ్లి మావోయిస్టులను వేటాడుతున్నారు. చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమస్యను మనుషులను చంపేయడం ద్వారా సాధించాలని భావించడం పెద్ద తప్పిదమని పౌర హక్కుల నేతలు ఆవేదన చెందుతున్నారు.

➡️