Odisha :  మత ఘర్షణలతో బాలాసోర్‌లో నిషేధాజ్ఞలు

భువనేశ్వర్‌ : మత ఘర్షణలు చెలరేగడంతో బాలాసోర్‌ పట్టణంలో సిఆర్‌పిసి సెక్షన్‌ 144 కింద సోమవారం ఒడిశా ప్రభుత్వం నిషేధపు ఉత్తర్వులు విధించింది. సమాధి సమీపంలో డ్రెయిర్‌ వాటర్‌ ఎర్రగా మారాయంటూ హిందూ కమ్యూనిటీకి చెందిన కొందరు ఆందోళనకు దిగారు. ఈద్‌ అల్‌ ఉదా వేడుకల సందర్భంగా ఆవులను వధించారంటూ ఆరోపించారు. ఈ వార్త పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో పెద్ద ఎత్తున ఆందోళనకారులు అక్కడికి చేరుకుని చాందిపూర్‌ -బాలాసోర్‌ ప్రధాన రహదారిని ముట్టడించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో హిందూ ముస్లిం వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నాయి.
ఈ ఘటనలో భద్రతా సిబ్బంది సహా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తతల దృష్ట్యా బాలాసోర్‌లోని పీర్‌ బజార్‌ నుండి పత్రపాడ వరకు ఉన్న ప్రాంతంలో 144 సెక్షన్‌ కింద నిషేధపు ఉత్తర్వులు విధించింది.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇరు కమ్యూనిటీల మధ్య ఘర్షణకు కారణమైన నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బాలాసోర్‌ కలెక్టర్‌ తెలిపారు. పాఠశాలలకు కూడా నేడు సెలవు ప్రకటించింది.

➡️