ఒమన్‌ సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం

Dec 16,2023 12:43 #Delhi, #international, #Oman

 

న్యూఢిల్లీ : ఒమన్‌ సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌కు శనివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రక్షణ దళాలు ఆయనకు గౌరవ వందనం చేశాయి. హైతం బిన్‌ తారిక్‌ భారత్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ ఆయనను స్వాగతించారు. తారిక్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు శనివారం ఆయన రాష్ట్రపతి భవన్‌ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు లాంఛనప్రాయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ.. ‘ఒమన్‌ సుల్తాన్‌ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహం, సహకారాన్ని మరింత పెంచుతుంది’ అని ఆయన అన్నారు. తారిక్‌ పర్యటన వల్ల ఒమన్‌, భారత్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది అని ఈమేరకు బాగ్చీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే న్యూఢిల్లీ, మస్కట్‌ల మధ్య దైత్య సంబంధాలలో సుల్తాన్‌ భారత్‌ పర్యటన ఓ మైలురాయిని సూచిస్తుంది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఒమన్‌ సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌కి తొలి భారత్‌ పర్యటన. భారత్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు ఆయన భారత్‌కు వచ్చారు.

కాగా, ఒమన్‌ సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌ శుక్రవారం దేశ రాజధానిలోని నేషనల్‌ గ్యాలరీ ఆప్‌ మోడ్రన్‌ ఆర్ట్‌ను సందర్శించారు. అనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఒమన్‌, భారత్‌ దేశాలు ప్రజల మధ్య దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచే సత్సంబంధాలున్నాయి. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాల్లో దీర్ఘకాలిక సంబంధాలున్నాయి. 1955లో ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలేర్పడ్డాయి. 2008లో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా మారాయి.

➡️