సమాచార మంత్రిత్వ శాఖ చర్య సరికాదు 

Feb 16,2024 09:24 #BJP Controversy, #Human Rights, #Media
Opposition to orders for deletion of 'The Caravan' article
  • ‘ది కారవాన్‌’ ఆర్టికల్‌ తొలగింపు ఆదేశాలపై వ్యతిరేకత 
  • ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, హక్కుల గ్రూపుల ఆందోళన

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లో ఆర్మీ కస్టడీలో ఉన్న పౌరుల మరణాలపై వచ్చిన కథనాన్ని తొలగించాలంటూ ‘ది కారవాన్‌ మ్యాగజైన్‌’ను సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశించటంపై ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, హక్కుల గ్రూపులు ఆందోళన వ్యక్తం చేశాయి. ది కారవాన్‌పై ప్రభుత్వ చర్య పత్రికా స్వేచ్ఛలోకి తీవ్రంగా చొరబడటమేనని ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 180 దేశాల్లో భారత్‌ 161వ స్థానంలో నిలవటమే దీనికి నిదర్శనమని పేర్కొంది. ప్రభుత్వం తన ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. ‘ది కారవాన్‌’ ఒక ముఖ్యమైన కథనాన్ని నివేదించిందనీ, దీని గురించి భారత ప్రజలకు తెలుసుకునే హక్కు ఉన్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నది. మ్యాగజైన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ హర్తోశ్‌ సింగ్‌ బాదల్‌ ప్రకటనను తాము సమర్థిస్తున్నామని వివరించింది. ”వాస్తవాన్ని నివేదించే మా హక్కు, పౌరులు వాస్తవాన్ని తెలుసుకునే హక్కుకు ఇది ప్రాథమిక సవాల్‌. ఇది వివాదాస్పదంగా ఉండొద్దు” అని హర్తోశ్‌ సింగ్‌ బాదల్‌ తన ప్రకటనలో స్పష్టం చేశారు. ది కారవాన్‌ కథనంలో వచ్చిన మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించటానికి బదులు.. భారత ప్రభుత్వం మ్యాగజైన్‌ను సెన్సార్‌ చేసిందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇండియా విమర్శించింది. ది ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌, ది డిజిటల్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌లు కూడా మోడీ సర్కారు చర్యను తప్పుబడుతూ స్పందించాయి.సంబంధిత ఆర్టికల్‌పై మ్యాగజైన్‌కు మంత్రిత్వ శాఖ సమాచార సాంకేతిక చట్టం లోని సెక్షన్‌ 69 కింద మంగళవారం నాడు ఉత్తర్వును జారీ చేసింది. ఫిబ్రవరి 1న ప్రచురించిన ఈ కథనాన్ని.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన కొన్ని గంటలకే సదరు మ్యాగజైన్‌ తొలగించింది. గతేడాది డిసెంబర్‌ 22న జమ్ముకాశ్మీర్‌లో ఆర్మీ కస్టడీలో ముగ్గురు పౌరుల మరణాలు, ఇతరులపై జరిగిన చిత్రహింసలకు సంబంధించి ఈ కథనంలో ఉన్నది. కథనాన్ని తొలగించినప్పటికీ.. మంత్రిత్వ శాఖ ఆదేశాలను సవాలు చేస్తామని మ్యాగజైన్‌ తెలపటం గమనార్హం.

➡️