బాహాటంగానే ముస్లింలపై విద్వేషం

May 6,2024 07:59 #BJP, #cartoon, #muslim
  • బిజెపి కార్టూన్‌ వీడియోపై ఎన్నికల కమిషన్‌ మౌనం

న్యూఢిల్లీ : ముస్లిములపై విద్వేషం వెళ్లగక్కుతూ కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేరికేచర్లతో కర్ణాటక బిజెపి శనివారం ఎక్స్‌లో వీడియో పోస్ట్‌ చేసి 24గంటలు గడిచినా ఎన్నికల కమిషన్‌ దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిజెపి బాహాటంగానే మతోన్మాద ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కన్నడలో ”బివేర్‌, బివేర్‌, బివేర్‌” అనే శీర్షికతో ఒక కార్టూన్‌ వీడియోను బిజెపి విడుదల చేసింది. అందులో ఒక గూట్లో మూడు గుడ్లు వున్నాయి. వాటిపై ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి అని వున్నాయి. రాహుల్‌గాంధీ ముస్లిం అని వున్న పెద్ద గుడ్డు తీసుకొచ్చి ఆ గూట్లో వేశారు. ఆ తర్వాత ఆ ముస్లిం గుడ్డు పొదగబడి నెత్తిపై టోపీ ధరించిన పెద్ద కోడిపిల్లగా మారుతుంది. మిగతా గుడ్ల నుంచి చిన్న పిల్లలు వస్తాయి. ‘నిధులు’ అని రాసి వున్న బాక్స్‌ నుండి ఆహారాన్ని తీసి ముస్లిం అని వున్న కోడి పిల్లకు పెడతారు.
అది మరింత పెద్దగా అవుతుంది. వెంటనే ఎస్‌సి,ఎస్‌టి, ఒబిసి అని రాసిన మూడు గుడ్లను అవతలకు విసిరేస్తుంది. దీన్ని చూసి గాంధీ, సిద్ధరామయ్యలు నవ్వుతున్నట్లు వ్యంగ్య చిత్రాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించి ది వైర్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
ఆదివారం కాంగ్రెస్‌ కూడా ఇసికి ఫిర్యాదు చేసింది. బిజెపి అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఐటి సెల్‌ ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ, రాష్ట్ర అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, సోషల్‌ మీడియా కర్ణాటక బిజెపి ఇన్‌చార్జిలపై కెపిసిసి మీడియా, కమ్యూనికేషన్‌ ఛైర్మన్‌ రమేష్‌ బాబు ఫిర్యాదు చేశారు. భిన్న మతాల మధ్య అల్లర్లను, శతృత్వాన్ని రెచ్చగొట్టడానికే ఉద్దేశపూర్వకంగా నిందితుడు ఈ చర్యకు పాల్పడ్డాడని స్పష్టంగా అర్ధమవుతోందని ఆ ఫిర్యాదులో రమేష్‌ బాబు పేర్కొన్నారు. దీనిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆయన పేర్కొన్నారు. మతాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నా, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా, ఇసి ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. బిజెపి ప్రచారంలో పెట్టిన ఈ తప్పుడు సమాచారంపై ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలని కోరారు.

➡️