భారత జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసెస్‌ స్పైవేర్‌ : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌

న్యూఢిల్లీ   :   యాపిల్‌ సంస్థ హెచ్చరికల అనంతరం భారత జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసస్‌ స్పైవేర్‌ను గుర్తించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్షేషనల్‌ గురువారం తెలిపింది. ‘ది వైర్‌’ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఎడిటర్‌ సిద్ధార్థ్‌ వరదరాజన్‌ మరియు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్ట్‌ ప్రాజెక్ట్‌ (ఒసిసిఆర్‌పి) సౌత్‌ ఆసియా ఎటిడర్‌ ఆనంద్‌ మంగ్నాలే ఫోన్‌లలో పెగాసెస్‌ స్పైవేర్‌ను గుర్తించినట్లు వెల్లడించింది. ఒసిసిఆర్‌పి గతేడాది ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబి) అధికారులను ఇంటర్వ్యూ చేసిందని, పదినెలల తర్వాత ఆయన ఫోన్‌ను స్పైవేర్‌ వైరస్‌ సోకిందని ఆమ్నెస్టీ పేర్కొంది. కార్పోరేట్‌ గ్రూప్‌ గురించి ఒసిసిఆర్‌పి రూపొందిస్తున్న పరిశోధనాత్మక కథనం కోసం తాను అదానీ గ్రూప్‌కు కొన్ని ప్రశ్నలు పంపినట్లు ఆనంద్‌ మంగ్నాలే వాషింగ్టన్‌ పోస్ట్‌కు వివరించారు. వరదరాజన్‌ ఫోన్‌కు అక్టోబర్‌ 16న వైరస్‌సోకినట్లు తెలిపింది.

ప్రభుత్వ ప్రోద్భలంతో దాడులు (స్టేట్‌ స్పాన్సర్డ్‌ ఎటాక్స్‌) జరగవచ్చంటూ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రతిపక్ష ఎంపిలు సహా పలువురు జర్నలిస్టులకు యాపిల్‌ సంస్థ వార్నింగ్‌ అలర్ట్‌లను పంపిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికను అందుకున్న అనంతరం వారు తమ ఫోన్‌లను పరీక్షించాల్సిందిగా ఆమ్నెస్టీకి అందించినట్లు పేర్కొంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కి చెందిన సెక్యూరిటీ ల్యాబ్‌ పరీక్షల్లో వారి ఫోన్‌లు పెగాసెస్‌ స్పైవేర్‌తో హ్యాక్‌ చేసినట్లు తేలిందని స్పష్టం చేసింది.

వాస్తవాలను వెలికితీస్తున్న జర్నలిస్టులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వారి గోప్యతపై చట్టవిరుద్ధమైన దాడితో సమానం మరియు భావప్రకటనా స్వేచ్ఛకు హక్కుని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. భారత్‌ సహా అన్ని దేశాలు చట్టవిరుద్ధమైన నిఘా నుండి ప్రజలను రక్షించడం ద్వారా మానవ హక్కులను సంరక్షించాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాయని స్పైవేర్స్‌ను గుర్తించే సెక్యూరిటీ ల్యాబ్‌ అధిపతి డోన్చా ఒ సియరాబెల్‌ పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 2021లో సిటిజన్‌ ల్యాబ్‌ గుర్తించిన విధంగా జర్నలిస్టుల నుండి సేకరించిన నమూనాలు ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌ బ్లాస్ట్‌పాస్‌ (బిఎల్‌ఎఎస్‌టిపిఎఎస్‌ఎస్‌) మరియు ఐఒఎస్‌ 16.6.1 (సివిఇ -2023-41064) నిఘాకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పెగాసెస్‌ స్పైవేర్‌ను అభివృద్ధి చేసిన ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌ దాని సాంకేతికతను ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది. భారత్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో 2017లో ఎన్‌ఎస్‌ఒ నుండి ఈ హార్డ్‌వేర్‌ను దిగుమతి చేసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అక్టోబర్‌లో భద్రతా హెచ్చరికలు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు ఈ హెచ్చరికలు ఎందుకు వచ్చాయనే దానిపై ప్రజలకు తప్పుడు  వివరణలను అందించేలా బిజెపి ప్రభుత్వం యాపిల్‌ సంస్థపై ఒత్తిడి తీసుకు వచ్చిందని వాషింగ్టన్‌ ఫోస్ట్‌ ప్రత్యేకంగా నివేదించింది. ఈ అలెర్ట్‌ మెసేజ్‌లు 150 దేశాల్లోని ప్రజలకు వెళ్లాయంటూ కేంద్ర మంత్రులు , యాపిల్‌ సంస్థ తప్పుదోవ పట్టించే, నిరాధారమైన ప్రకటనలు చేసినట్లు తెలిపింది. అయితే ఇతర దేశాల ప్రజలు, అధికార పార్టీ చట్టసభ సభ్యులు ఆ వారంలో యాపిల్‌ సంస్థ నుండి హెచ్చరికలు స్వీకరించలేదని పేర్కొన్నారు. భారత్‌లోని పలువురు ప్రతిపక్షనేతలు, జర్నలిస్టులు , కార్యకర్తలను పెగాసెస్‌ 2021 వరకు లక్ష్యంగా చేసుకుందని స్పైవేర్‌ ప్రపంచ వ్యాప్త టార్గెట్స్‌ గురించి నివేదించిన ఫర్బిడెన్‌ స్టోరీస్‌ కలెక్టివ్‌ వెల్లడించింది.

➡️