Supreme Court: కొవిషీల్డ్‌పై మెడికల్‌ ప్యానెల్‌ దర్యాప్తు కోరుతూ పిటిషన్

న్యూఢిల్లీ :    కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ‘ప్రమాద కారకాల’పై దర్యాప్తు చేపట్టేందుకు మెడికల్‌ ప్యానెల్‌ను నియమించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది విశాల్‌ తివారీ బుధవారం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎఐఐఎంఎస్‌ నిపుణుల నేతృత్వంలో మెడికల్‌ ప్యానెల్‌ను నియమించాలని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించేలా చూడాలని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆరోగ్య వైఫల్యాలు లేదా మరణాలు ఎదుర్కొన్న పౌరులు, కుటుంబాలకు వ్యాక్సిన్‌ డ్యామేజ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. నకిలీ వ్యాక్సిన్‌ల వ్యాప్తిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

”భారత్‌లో 175 కోట్లకు పైగా ప్రజలు ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కొవిడ్‌ 19 తర్వాత  ప్రజల్లో గుండె పోటు, ఆకస్మికంగా కుప్పకూలడంతో మరణాలు పెరిగాయి. యువతలో కూడా గుండెజబ్జుల సంఖ్య పెరిగింది.  కొవిషీల్డ్‌ కారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం, రక్తం గడ్డ కట్టడం వంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయని అంగీకరిస్తూ  ఆస్ట్రాజెన్‌కా బ్రిటన్‌ కోర్టులో పత్రాలు సమర్పించింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు  ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడంతో విపత్కర,  ప్రమాదకర పరిణామాలపై  ఆలోచించవలసి వస్తోంది” అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొవిడ్‌ 19కి వ్యతిరేకంగా ఆస్ట్రాజెన్‌కా రూపొందించిన ఎజెడ్‌డి1222 వ్యాక్సిన్‌ను భారత్‌లో కొవీషీల్డ్‌ కింద సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) లైసెన్స్‌ అందించిందని, అత్యంత అరుదైన కేసుల్లో తక్కువ ప్లేట్‌లెట్లు కలిగిన వారిలో ఇది రక్తం గడ్డకట్టేందుకు కారణమౌతుందని పిటిషన్‌  హైలెట్‌ చేసింది. థ్రాంబోసిస్‌ విత్‌ త్రాంబోసిటోపెనియా సిండ్రోమ్‌ (టిటిఎస్‌)గా పిలిచే వైద్య పరిస్థితికి తమ వ్యాక్సిన్‌కు సంబంధముందని కంపెనీ అంగీకరించిందని పేర్కొంది.

➡️