లక్షద్వీప్‌లో తగ్గిన పెట్రో-డీజిల్‌ ధరలు

Mar 17,2024 08:58 #diesel, #Lakshadweep, #petrol, #prices, #reduced

న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.. లక్షద్వీప్‌లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ పై రూ.15 తగ్గిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే ఆయన ఈ ప్రకటన చేశారు. ఇక శుక్రవారమే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ పై కేంద్రం రూ.2 తగ్గించింది. దూరంగా ఉన్న దీవులకు ఇంధనం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకుగాను వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్‌ను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తొలగించడంతో ఈ మేరకు ద్వీప వాసులకు ఊరట లభించింది.

లక్షద్వీప్‌ సముదాయంలోని అండ్రోట్‌, కల్పెనీ దీవుల్లో పెట్రోల్‌, డీజిల్‌ లీటరుపై రూ.15.3 మేర తగ్గాయి. కవరట్టి, మినికారు దీవుల్లో రూ.5.2 మేర తగ్గాయి. కవరట్టి, మినికారు దీవుల్లో గతంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.105.94 కాగా రూ.100.75కి తగ్గింది. అండ్రోట్‌, కల్పెనీ దీవుల్లో రూ.116.13గా ఉన్న పెట్రోల్‌ ధర రూ.100.75కి చేరింది. కవరట్టి, మినికారు దీవుల్లో డీజిల్‌ ధర 110.91 నుంచి రూ.95.71కి, అండ్రోట్‌, కల్పెనీల్లో రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గింది.

➡️