PM Modi : కాశ్మీర్‌లో మోడీకి నిరసనల సెగ

– ప్రధాని తొలి పర్యటనలో గళమెత్తిన జనం

– లఢక్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ భారీ నిరసన

– నిరాహార దీక్ష ప్రారంభించిన మెగసెసే అవార్డు గ్రహీత వాంగ్‌చుక్‌

లఢక్‌ : జమ్మూకాశ్మీర్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి నిరసన సెగ తగిలింది. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. అయితే లఢక్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. లఢక్‌ ప్రాంతంలోని లెV్‌ాలో దుకాణాలు, వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేశారు. ప్రజా జీవనం పూర్తిగా స్తంభించింది. మరోవైపు ఈ నెల 4న కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో జరిపిన చర్చలు విఫలమవడంతో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని పర్యావరణ కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రకటించారు. లఢక్‌లో రాజ్యాంగంలోని ఆరో షెడ్యులును అమలు చేసి, రాష్ట్ర హోదా కల్పించాలన్న తమ డిమాండ్‌ను కేంద్రం తిరస్కరించిందని ఆయన చెప్పారు. లఢక్‌లో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన ప్రారంభించాలని వారు నిర్ణయించారని అన్నారు. తమ డిమాండ్‌ను రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని దృష్టికి తెచ్చేందుకు ప్రజలు భారీ ప్రదర్శన చేపట్టారు. మరోవైపు లె- అపెక్స్‌ బాడీ (ల్యాబ్‌), కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (కెడిఎ)తో చర్చలు కొనసాగుతున్నాయని కేంద్రం తెలిపింది. అయితే చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోందని ల్యాబ్‌ కో-చైర్మెన్‌ లక్రుక్‌ చెప్పారు.

బిజెపి ప్రచార వేదికను తలపించిన ప్రధాని సభ

తొలి పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గురువారం నాడు రూ.6400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ జమ్మూకాశ్మీర్‌ విజయ గాథ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకొచ్చారు. ఇక్కడి సరస్సుల్లో ఎక్కడ చూసినా ‘కమలం’ కన్పిస్తోందన్నారు. ప్రజాధనంతో నిర్వహించిన ఈ సభను బిజెపి ఎన్నికల ప్రచారవేదికగా మార్చేశారు. ’50 ఏళ్ల కిందట ఏర్పడిన జమ్మూకాశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లోగో కమలం. బిజెపి గుర్తు కూడా అదే. కమలంతో రాష్ట్రానికి గాఢమైన అనుబంధం లేదా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం వృద్ధి చెందిందన్నారు. గత సంవత్సరం రెండు కోట్ల మందికి పైగా ప్రజలు రాష్ట్రాన్ని సందర్శించారని తెలిపారు. అయితే జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడంపై కానీ, ఈ ఏడాది సెప్టెంబరులోగా ఎన్నికలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయాన్ని కానీ ప్రధాని ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో మోడీ సభకు వచ్చిన ప్రజలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేదని వాపోయారు. పర్యాటక గొప్పలు చెబుతూ ఇక్కడంతా శాంతియుత వాతావరణం ఉన్నట్లుగా, అభివృద్ధి పరుగులు పెడుతున్నట్లుగా దేశ ప్రజానీకానికి బిజెపి, ప్రధాని మోడీ అసత్యాలు చెబుతున్నారని వారంతా తీవ్ర స్థాయిలో విమర్శించారు.

➡️