మే 5 నుంచి 8 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Apr 10,2024 07:34 #2024 elections, #Postal Ballots

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు (ఆర్మీ, నేవీ, డిఫెన్స్‌) తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పిస్తుంది. రాష్ట్రానికి సంబంధించి సర్వీస్‌ ఓటర్లు 67,393 మంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు మే నెల 5, 6, 7 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఫెసిలిటేషన్‌ సెంటర్లో తమ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారు. ఇందులో మే 5న పిఒ, ఎపిఒ, మైక్రో అబ్జర్వర్లు, 6న ఒపిఒలు, 7న పోలీసులు, ఎవిఇఎస్‌, ప్రైవేటు వ్యక్తులు (ఎన్నికల విధుల్లో ఉండేవారు) ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో 8వ తేదీన పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
22లోగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రతిపాదనలు
పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబందించిన ప్రతిపాదనలను ఆయా శాఖల నుంచి ఈ నెల 22లోగా జిల్లా ఎన్నికల అధికారులకు అందజేయాలని నోడల్‌ అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని స్పెషల్‌ ఓటర్లు, సర్వీస్‌ ఓటర్లు, ఓటర్స్‌ ఆన్‌ ఎలక్షన్‌ డ్యూటీ, ఎలక్ట్రోస్‌ సబ్జెక్ట్‌ టూ ప్రిసెంటివ్‌ డిటెక్షన్‌, ఓటర్స్‌ ఇన్‌క్లూడింగ్‌ ఓటర్స్‌ ఎక్స్‌ ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ (ఎవిఇఎస్‌) అనే ఐదు కేటగిరీలకు చెందిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పిస్తోంది.
పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటు ఇలా..
తొలుత ఫారమ్‌-12 పూర్తి చేసి, ఆధార్‌, ఎన్నికల డ్యూటీ ఆర్డర్‌, ఐడి జత చేసి ఓటున్న నియోజకవర్గం హెడ్‌ క్వార్టర్‌లో తహశీల్దారుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. 13-ఎ డిక్లరేషన్‌తోపాటు ఫారమ్‌-13డి సూచనలు, బ్యాలెట్‌ ఇస్తారు. ఫారమ్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాల్సి ఉంటుంది. 13-ఎ పూర్తి చేసి, ఓటు వేసే ఉద్యోగి సంతకంతో పాటు గెజిటెడ్‌ అధికారి సంతకం కూడా చేయించాల్సి ఉంటుంది. ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో గెజిటెట్‌ ఆఫీసరు అందుబాటులో ఉండేలా ఇసి చర్యలు తీసుకుంటుంది. 13-బి కవర్‌ ఎ, పూర్తి చేసిన అనంతరం టిక్‌ చేసిన బ్యాలెట్‌ను అందులో పెట్టి సీల్‌ వేయాలి, అనంతరం 13-సి కవర్‌ బిలో కవర్‌ఎ, 13 -ఎ డిక్లరేషన్‌లను ఉంచి సీల్‌ చేసి కవర్‌పై వివరాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ను వేయడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
నియామక పత్రంతోపాటు ఫారం -12 జారీ
పిఒ, ఎపిఒ, ఒపిఒలకు ఈ నెల 6 నుంచి 8 వరకు రిటర్నింగ్‌ అధికారుల ద్వారా నియామకపత్రంతో పాటు ఫారం-12 జారీ చేశారు. పిఒ, ఎపిఒలు ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే శిక్షణ సమయంలో పూర్తి చేసిన ఫారమ్‌-12ను సంబంధిత ఆర్‌ఒలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒపిఒలు శిక్షణ సమయంలో ఈ నెల 15న నింపిన ఫారమ్‌ను సంబంధిత ఆర్‌ఒలకు సమర్పించాల్సి ఉంటుంది. ఆర్‌ఒ, పిఆర్‌ఒ, ఒపిఒల నియోజకవర్గాల ఫారమ్‌ -12ను వేరు చేయాలి. వాటిని జిల్లాల్లోని సంబంధిత నియోజకవర్గం ఆర్‌ఒకు అప్పగించాలి. ఈ నెల 15న జిల్లాల నోడల్‌ అధికారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేయాల్సి ఉంటుంది. పోలీస్‌ డిపార్టుమెంట్‌ నోడల్‌ అధికారి ఫారం-12/12 డిని ఈ నెల 10లోపు సంబంధిత ఆర్‌ఒకు సమర్పించాల్సి ఉంటుంది. ఇతర జిల్లాలకు చెందిన ఫారం -12/12డిని జిల్లా నోడల్‌ అధికారికి (పోస్టల్‌ బ్యాలెట్‌లు) అందజేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ పేర్కొంటోంది. ఇతర ఎసెసిన్సియల్‌ సర్వీస్‌ డిపార్టుమెంట్లు ఈ నెల 12లోగా ఫారం-12డిని జిల్లా స్థాయి నోడల్‌ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. వారు నియోజకవర్గాల వారీ వాటిని వేరు చేసి జిల్లాల్లోని సంబంధిత ఆర్‌ఒలకు అందజేయాలి. ఇతర జిల్లాలకు చెందిన ఫారం-12డిని వేరు చేసి డిఇఒకు అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత జిల్లా ఆర్‌ఒలకు ఫారమ్‌ -12/12డిని పంపడంతోపాటు ఆర్‌ఒల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌లను సేకరించి ప్రత్యేక మెసెంజర్‌ ద్వారా అభ్యర్థించే జిల్లాలకు పంపాలి. మైక్రో అబ్జర్వర్ల కోసం ఫారం-12ను శిక్షణ సమయంలో సేకరిస్తారు.

➡️