సుప్రీంకోర్టుకు పొట్లూరి వరప్రసాద్‌

Feb 26,2024 20:36 #Potluri Varaprasad, #Supreme Court

 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పొట్లూరి వరప్రసాద్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బొగ్గు కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో పొట్లూరి వరప్రసాద్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతినిస్తూ… ఈ ఏడాది జనవరి 30న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు తుది ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆ ఉత్తర్వులను ఆయన నేరుగా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేయకుండా… నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంపై జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. 2017లో సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకే బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారని పొట్లూరి తరపున న్యాయవాదులు తెలిపారు. 2017లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ.. ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఎలా వర్తిస్తాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్‌లో తదుపరి వాదనలకు ముందు… హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చే వ్యవహారంపై తాము ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో ఇడి అభిప్రాయం తీసుకున్న తరువాతే నిర్ణయం తీసుకుంటామంది. 2017లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యేక కోర్టు ఆదేశాలను నేరుగా సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చో లేదో కౌంటర్‌ దాఖలు చేయాలని ఇడిని న్యాయస్థానం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ రెండు వారాల తరువాత చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

➡️