నూతన ఇసిలను నియమించకుండా కేంద్రాన్ని నిరోధించండి

  •  సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ పిటీషన్‌

న్యూఢిల్లీ : 2023 చట్టం ప్రకారం కొత్తగా ఎలక్షన్‌ కమిషనర్లను నియమించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిరోధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలయింది. కాంగ్రెస్‌ నాయకురాలు జయ ఠాకూర్‌ ఈ పిటీషన్‌ దాఖలు చేశారు. అనుప్‌ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్‌ గోయల్‌ రాజీనామాతో కేంద్ర ఎన్నికల సంఘంలో రెండు ఎన్నికల కమిషనర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఈ నెల 15 లోగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్యానెల్‌ భర్తీ చేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పిటీషన్‌ దాఖలయింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, కార్యాలయ నిబంధనలు) చట్టం 2023లో నియమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని జయ తన పిటీషన్‌లో గుర్తు చేశారు. జనవరి 12న వేసిన పిటీషన్‌ పెండింగ్‌లో ఉందని తెలిపారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కానున్న నేపథ్యంలో నూతన ఇసిలు తక్షణమే నియమించాల్సి అవసరం ఉందని, కాబట్టి తన పిటీషన్‌పై త్వరగా తీర్పు చెప్పాలని గౌరవపూర్వకంగా అభ్యర్థిస్తున్నానని పిటీషన్‌లో ఠాగూర్‌ తెలిపారు.
2023 చట్టం ప్రకారం సిఇసి, ఇసిలను ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్‌ సిఫార్సు ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. ఈ ప్యానెల్‌లో ప్రధానమంత్రితోపాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి చేత నామినేట్‌ చేయబడిన ఒక కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు.

➡️