అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడి

అయోధ్య (యుపి) : ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి శనివారం రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్‌ జంక్షన్‌’గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తదితరులు ఉన్నారు.

రైల్వే స్టేషన్‌ విశేషాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రధానికి వివరించారు. అంతకుముందు అమృత్‌ భారత్‌ రైల్లోకి వెళ్లి విద్యార్థులతో ప్రధాని కొంతసేపు ముచ్చటించారు. పర్యటనలో భాగంగా అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోడి ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం అనంతరం ఎయిర్‌పోర్టు పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్‌ సభ’లో ప్రసంగిస్తారు. ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించారు. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్‌ విస్తరించి ఉంది. ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్‌ ఇండియా టెక్నికల్‌, ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(రైట్స్‌) అభివృద్ధి చేసింది.

రైళ్లు సర్వీసులు…

రెండు అమృత్‌ భారత్‌ రైళ్లలో ఒకటి ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ టెర్మినల్‌ నుంచి అయోధ్య మీదుగా బీహార్‌లోని దర్బంగా వరకూ ప్రయాణించనుండగా.. రెండో పశ్చిమబెంగాల్‌లోని మాల్దా టౌన్‌ నుంచి బెంగళూరులోని ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినస్‌ మధ్య నడవనుంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణం సాగనుంది. అయితే, ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుంది. జనవరి 7 నుంచి రెగ్యులర్‌గా నడవనుంది.

రైళ్లలో సౌకర్యవంతమైన ఏర్పాట్లు….

ఈ సూపర్‌ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలులో 22 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో 12 నాన్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ స్లీపర్‌ క్లాస్‌లు, 8 జనరల్‌ అన్‌రిజర్వుడ్‌ కోచ్‌లతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సౌకర్యవంతమైన సీట్లు, మెరుగైన లగేజీ రాక్‌లు, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌లు, ఎల్‌ఈడీ లైట్లు పబ్లిక్‌ ఇన్ఫర్‌మేషన్‌ సిస్టమ్‌, సీసీ టీవీ, పరిశుభ్రత, ఆధునిక టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేశారు.

టిక్కెట్టు ధరలు…

ఈ రైళ్లలో ఒక కి.మీ నుంచి 50 కి.మీ లోపు ప్రయాణానికి కనీస టికెట్‌ ధర రూ.35గా నిర్ణయించారు. టికెట్‌ ఛార్జీలు ఇతర మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ల కంటే 15-17 శాతం ఎక్కువగా ఉంటాయి. దానికి రిజర్వేషన్‌ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారమిచ్చింది. ఏసీ తరగతుల రుసుములు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అమృత్‌ భారత్‌ రైళ్లు గరిష్టంగా 130 కి.మీ వేగంతో పరుగులు పెట్టనుంది. 50 కి.మీ.లోపు దూరానికి కనీస టికెట్‌ ధర రూ.35గా ఉంటుంది.

➡️