అమేథీపై అనిశ్చితి.. స్పందించిన రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ :    ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మే 20న పోలింగ్‌ జరగనున్న ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తారని అందరూ ఊహించారు. రాహుల్‌ గాంధీ ఇప్పటికే వయనాడ్‌ నుండి పోటీకి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అయితే తాజాగా రాహుల్‌గాంధీ బావ (ప్రియాంక భర్త) రాబర్ట్‌ వాద్రా పోటీ దాదాపు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తో పాటు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు.  మీడియా నుండి ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది.

” వెరీగుడ్‌. ఇది బిజెపి ప్రశ్న. మా పార్టీలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఎలక్షన్‌ కమిటీ ఏ ఆదేశాలిచ్చినా.. దానిని నేను పాటిస్తాను ” అని రాహుల్‌ గాంధీ సమాధానమిచ్చారు. తాను పార్టీలో ఓ సైనికుడినని, కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.

గాంథీ కుటుంబానికి కంచుకోట అయిన అమేథీలో 2019 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ గాంధీ ఓటమిపాలయ్యారు.

15 -20 రోజుల క్రితం బిజెపి 180 సీట్లను గెలుచుకుంటుందని భావించామని, అయితే ఇప్పుడు కేవలం 150 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. ఇండియా కూటమికి మద్దతు పెరుగుతోందని, పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రతి రాష్ట్రం నుండి నివేదికలు వస్తున్నాయని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

➡️