తప్పుడు ప్రకటనలపై తలొంచిన రాందేవ్‌ బాబా

Apr 3,2024 07:52 #false statements, #Ramdev Baba
  • సుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణ
  • పదేపదే ఉల్లంఘనలపై ధర్మాసనం ఆగ్రహం

న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత వివాదస్పద ఉత్పత్తులను తప్పుడు ప్రచారంతో జనంపై రుద్దుతున్న యోగా గురు రాందేవ్‌ బాబా సుప్రీంకోర్టులో మంగళవారం వ్యక్తిగతంగా హాజరై బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇక మీదట ఉల్లంఘనలకు పాల్పడబోమని చెప్పారు. ఆయన అనుచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరు బాలకృష్ణ కూడా సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పారు. కోవిడ్‌ నివారణి అంటూ విపత్తు సమయంలోనూ, ఆ తర్వాత కూడా అనేక ఉత్పాధనలపై తప్పుడు ప్రచారం చేసి మార్కెట్లోకి ప్రవేశిపెట్టిన వీరిద్దరి తీరుపై సుప్రీంకోర్టు ఇదివరకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వారి వైఖరిలో మార్పు రాకపోవడం, సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లలోనూ తప్పుడు సమాచారం పొందుపర్చడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన సమాచారంతో అఫిడవిట్లు సమర్పించాలని, మరోమారు రాందేవ్‌, బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరుకావాల్సివుంటుందని నిర్దేశించింది.
ప్రజలను తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటన కేసులో సక్రమంగా అఫిడవిట్లు దాఖలు చేయకుండా ఇచ్చిన హామీలను ఉల్లంఘించారని కోర్టు విమర్శించింది. డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ (మ్యాజిక్‌ రెమిడీస్‌) చట్టం చాలా ప్రాచీనమైనదని పతంజలి ఎండి చేసిన ప్రకటనతో కోర్టు విభేదించింది. కేవలం సుప్రీం కోర్టనే కాదని, దేశవ్యాప్తంగా ఏ న్యాయస్థానమైనా జారీ చేసే ప్రతి ఆదేశాన్నీ గౌరవించాల్సిందేనని జస్టిస్‌ హిమా కొహ్లి, జస్టిస్‌ అసదుద్దీన్‌ అమనుల్లా లతో కూడిన బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇది సంపూర్ణమైన ఉల్లంఘనే అని పేర్కొంది. న్యాయస్థానానికి మీరిచ్చిన హామీకి కట్టుబడి వుండాలి, కానీ మీరు ప్రతి చోటా ఉల్లంఘిస్తూనే వచ్చారని బెంచ్‌ పేర్కొంది. బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో కోర్డు రూమ్‌లో రాందేవ్‌, పతంజలి ఎండి వున్నారు. కోవిడ్‌కు అల్లోపతిలో చికిత్సే లేదని చెబుతుంటే కేంద్రం కళ్ళు మూసుకుని ఎలా కూర్చుందని సుప్రీం విస్మయం వ్యక్తం చేసింది. రాందేవ్‌ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది బల్బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ, యోగా గురు కోర్టుకు హాజరు కావడాన్ని, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఏదైతే జరిగిందో అది మరోసారి జరగబోదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు చెప్పారు. కావాలంటే ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి అవసరమైతే సంబంధిత పక్షాల న్యాయవాదులకు సాయం చేస్తానని ముందుకొచ్చారు. ముందుగా మీరిచ్చిన హామీలకు అనుగుణంగా అఫిడవిట్లు దాఖలు చేయాలని బాలకృష్ణ తరపు న్యాయవాదికి జస్టిస్‌ కొ హ్లి చెప్పారు. రాందేవ్‌కు చివరి అవకాశంగా అఫిడవిట్లు దాఖలు చేసేందుకు మరో వారం గడువు ఇచ్చింది. తిరిగి ఏప్రిల్‌ 10న తదుపరి విచారణకు వాయిదా వేసింది.

➡️