మోడీతో చర్చకు సిద్ధమే !

May 12,2024 00:40 #discuss with Modi!, #Rahul Gandhi

సుముఖత వ్యక్తం చేసిన రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ : ప్రధాని మోడీతో పబ్లిక్‌ డిబేట్‌లో పాల్గనాల్సిందిగా ఇరువురు జ్యూరిస్ట్‌లు, సీనియర్‌ ఎడిటర్‌ పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆమోదించారు. మోడీతో చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి రిటైర్డ్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజిత్‌ పి షా, హిందూ మాజీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఎన్‌ రామ్‌ ఈ నెల 9న రాహుల్‌ను, మోడీని బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆహ్వానించారు. పక్షపాత రహితమైన, వాణిజ్యయేతర వేదికపైన ఈ చర్చ జరుగుతుందన్నారు. ఆ ప్రతిపాదనకు ఆమోదిస్తూ రాహుల్‌ ఒక లేఖ రాశారు. ఆ కాపీని శనివారం విడుదల చేశారు. తాను గానీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గానీ చర్చకు హాజరవుతామన్నారు. ఆహ్వానంపై స్పందించడానికి ముందు తాను ఖర్గేతో చర్చించానని తెలిపారు. ప్రధాన పార్టీలుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు ఆ నేతలు చెప్పేది ప్రత్యక్షంగా ప్రజలు వినాలని రాహుల్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని అంగీకరించారా లేదా అనేది తెలియచేస్తే ఎక్కడ, ఎప్పుడు, ఏ రీతిలో చర్చ అనే వివరాలు తర్వాత చర్చించుకోవచ్చని చెప్పారు. తాము హాజరు కాలేమని అనుకున్నపుడు ఈ చర్చలో పాల్గనేందుకు అవసరమైతే తమ ప్రతినిధిని నామినేట్‌ చేసేందుకు కూడా ఆ ఆహ్వానంలో వెసులుబాటు కల్పించారు.
ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం
మన రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి సంబంధించిన కీలక ప్రశ్నలు వుంటాయని ఆహ్వానపత్రికలో న్యాయమూర్తులు, ఎన్‌ రామ్‌ పేర్కొన్నారు. కేవలం ఆరోపణలు, సవాళ్ళు మాత్రమే ఇరు పక్షాల నుండి వింటున్నామని, అర్ధవంతమైన ప్రతిస్పందనలు వినిపించడం లేదని అందుకే ఈ ప్రతిపాదన అని తెలిపారు. చర్చ అనేది భారత ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైనదని వ్యాఖ్యానించారు. ఇరువురు నేతలు అంగీకరిస్తే దీనికి కావాల్సిన విషయాలన్నీ ఖరారు చేస్తామని తెలిపారు. కాగా మోడీ గానీ బిజెపి ప్రతినిధులు గానీ శనివారం సాయంత్రం వరకు రాహుల్‌ సుముఖతపై వ్యాఖ్యానించలేదు. రాహుల్‌ శుక్రవారమే తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. కానీ బహుశా ప్రధాని మోడీ తనతో చర్చకు రాకపోవచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

➡️