ఇజ్రాయిలీ నౌకలో ఆయుధాల లోడింగ్‌, అన్‌లోడింగ్‌కుకార్మికుల తిరస్క ృతి

Feb 21,2024 10:40 #national

న్యూఢిల్లీ: ఇజ్రాయిల్‌కు మిలిటరీ కార్గో నౌకలోకి ఆయుధాలను లోడింగ్‌ చేసేందుకు జల రవాణా కార్మికులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పదకొండు ఓడరేవుల్లోని 3,500 కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటర్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ పిలుపు మేరకు దేశవ్యాపితంగా 11 ప్రధాన ఓడ రేవులకు చెందిన కార్మికులు నౌకలోకి ఆయుధాలను ఎక్కించడం కానీ, దించడం కానీ చేయబోమన్నారు. ఇజ్రాయిల్‌ గాజాలో సాగిస్తున్న దారుణ మారణకాండకు నిరసనగాను, కాల్పుల విరమణను తిరస్కరించడానికి వ్యతిరేకంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ తెలిపింది. ఇటీవల ఇజ్రాయిల్‌ గాజాపై జరిపిన దాడిలో వేలాది మంది పాలస్తీనీయులు సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డారని, ఇజ్రాయిలీ బాంబుదాడుల్లో పిల్లలు, మహిళల శరీరాలు తునాతునకలయ్యాయని, పిల్లల మృత దేహాలను తల్లిదండ్రులు గుర్తించడానికి కూడా వీలు లేకపోయిందని, ఇలా పాలస్తీనీయులను అనేక కష్ట నష్టాలకు గురి చేస్తున్న ఇజ్రాయిల్‌ దాష్టీకాలను తాము తీవ్రంగా నిరసిస్తున్నామని వాటర్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు టి నరేంద్రరావు ‘ది వైర్‌’ కు తెలిపారు. పాలస్తీనీయులకు ఫెడరేషన్‌ తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు.

➡️