పూర్తి వివరాలు విడుదల చేయండి

ప్రతి దశ పోలింగ్‌ తర్వాత ప్రెస్‌ మీట్‌ పెట్టండి
ఎన్నికల కమిషన్‌కు పాత్రికేయ సంఘాల లేఖ

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడు దశలు ముగిసినప్పటికీ ఒక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఐదు పాత్రికేయ సంఘాలు ఈసీపై మండిపడ్డాయి. ఈ మేరకు ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఉమెన్‌ ప్రెస్‌ కార్పొరేషన్‌, ప్రెస్‌ అసోసియేషన్‌, విదేశీ కరస్పాండెంట్ల క్లబ్‌, ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ సంయుక్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఓ లేఖ రాశాయి.
గత మూడు దశల ఎన్నికల్లో కచ్చితంగా ఎన్ని ఓట్లు పోల్‌ అయిందీ ఎన్నికల కమిషన్‌ ఇప్పటి వరకూ వెల్లడించలేదని ఆ సంఘాలు తమ లేఖలో గుర్తు చేశాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అంటూ దిగ్భ్రాంతిని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలు నిస్పాక్షిక ఎన్నికలపై ప్రజల మనసులో ఆందోళనలు రేపాయని తెలిపాయి.
‘2019 ఎన్నికల వరకూ ప్రతి దశ పోలింగ్‌ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఉండేది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ నుండి ఓటింగ్‌ జరిగిన రోజు ఏం జరిగిందో తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వారి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసేవారు. దీనివల్ల పత్రికా పాఠకులకు పొరబాట్లకు అవకాశం లేని సమాచారం అందేది’ అని పాత్రికేయ సంఘాలు ఆ లేఖలో వివరించాయి. ప్రతి దశ పోలింగ్‌ తర్వాత విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఓట్ల శాతం ఎంత వంటి వివరాలన్నీ అందజేయాలని డిమాండ్‌ చేశాయి. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కలగాలంటే ఇలాంటి పారదర్శకత అవసరమని నొక్కి చెప్పాయి.

➡️