ఎలనాగకు సాహిత్య అకాడమీ అనువాద అవార్డు

  •  24 భాషల్లో అవార్డులు ప్రకటన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కరీంనగర్‌కు చెందిన ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు, భాషావేత్త నాగరాజు సురేంద్ర (ఎలనాగ)కు ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కింది. 2023కు గానూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మళయాళం, తమిళ్‌, నేపాలీ, ఉర్దూ, ఒడియా వంటి ఇతర భాషల్లో 24 మంది అనువాదకులకు సోమవారం సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఇంగ్లీష్‌లో పవన్‌ కె వర్మ రచించిన ‘గాలిబ్‌: ది మ్యాన్‌’ పుస్తకాన్ని ‘ఎలనాగ’ తెలుగులోకి అనువాదం చేశారు. ‘గాలిబ్‌ నాటి కాలం’ పేరుతో ఎలనాగ రచించిన ఈ పుస్తకం అనువాద విభాగంలో ప్రస్తుతం అవార్డుకు ఎంపికైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న అవార్డుల ప్రదానోత్సవంలో పురస్కార గ్రహీతలకు రూ.50 వేల నగదు, తామపత్రం అందించనున్నట్లు సాహిత్య అకాడమీ వెల్లడించింది. ఇప్పటి వరకు దాదాపు 40 గ్రంథాలను ఎలనాగ ప్రచురించారు. కలుపు మొక్క, వాగంకురాలు, పెన్మంటలు-కోకిలమ్మ పదాలు, కొత్తబాని వంటివి సాహిత్య లోకాన్ని అలరించాయి.

➡️