కోర్టు ఆదేశాలను ఎస్‌బిఐ పాటించాల్సిందే

Mar 8,2024 10:52 #Supreme Court

నిరసనలకు సిపిఎం పొలిట్‌బ్యూరో పిలుపు

న్యూఢిల్లీ : ఎలక్టొరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ఎస్‌బిఐ పాటించాల్సిందేనని సిపిఎం డిమాండ్‌ చేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేస్తూ, మోడీ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి ఎన్నికలు అయ్యేదాకా ఎలక్టొరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించకుండా నాన్చాలని ఎస్‌బిఐ చూస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఎస్‌బిఐల ఎదుట నిరసనలు తెలపాలని పొలిట్‌బ్యూరో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెబుతూ, ఆ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు అందచేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్‌బిఐ విఫలమైంది. ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్‌బిఐకి ఇచ్చిన మూడు వారాల గడువు ముగిసింది. ఆ వివరాలను వెల్లడించడానికి బదులు ఎస్‌బిఐ, గడువు ముగుస్తున్న సమయంలో మరో 116 రోజులు అదనపు గడువు కావాలని కోర్టును ఆశ్రయించింది. జూన్‌ 30కల్లా మొత్తంగా కోరిన సమాచారమంతా అందచేస్తామని తెలిపింది. అంటే ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించకుండా వుండేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. తన కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్‌ చేసిన ఎస్‌బిఐ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కొద్ది రోజుల్లో పొందుపరిచి ఇవ్వలేకపోయిందంటే నమ్మశక్యంగా లేదని పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిళ్ళ కారణంగానే ఎస్‌బిఐ సహించరాని ఈ వైఖరి తీసుకుని వుండవచ్చని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇప్పటికైనా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ ఎస్‌బిఐ అందచేసేలా సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాలని కోరింది.

➡️