వాక్‌ స్వాతంత్య్రానికి సంకెళ్లు

May 3,2024 08:19 #car, #Journalist
  • జర్నలిస్టులపై దాడులు…
  • సెన్సార్‌షిప్పులు జనవరి నుండి 134 ఘటనలు

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో వాక్‌ స్వాతంత్య్రానికి సంకెళ్లు పడ్డాయి. దీనికి సంబంధించి జనవరి – ఏప్రిల్‌ నెలల మధ్య 134 ఘటనలు చోటుచేసుకున్నాయని ఫ్రీ స్పీచ్‌ కలెక్టివ్‌ అనే సంస్థ ఓ నివేదికలో తెలిపింది. దీనిని బుధవారం ప్రచురించారు. వాక్‌ స్వాతంత్య్రాన్ని అడ్డుకునేం దుకు పాత్రికేయులు, విద్యావేత్తలు, యూట్యూబర్లు, విద్యార్థులు, ఇతరులపై వేధింపులు, దాడులు, అరెస్టులు, సెన్సార్‌షిప్పులు వంటి చర్యలకు పాల్పడ్డారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం, బెదిరించడం, ఇంటర్నెట్‌ కనెక్షన్లను తొలగించడం వంటి ఉదంతాలు కూడా జరిగాయి.
ఈ ఏడాది ప్రారంభం నుండి ఏప్రిల్‌ వరకూ 34 మంది పాత్రికేయులపై దాడులు జరిగాయి. ఫిబ్రవరి 9న పూనేలో జరిగిన ఓ బహిరంగసభకు హాజరయ్యేందుకు హక్కుల కార్యకర్త విశ్వంభర్‌ చౌదరి, మానవ హక్కుల న్యాయవాది అశిం సరోడ్‌తో కలిసి బయలుదేరిన నిఖిల్‌ వాగ్లే అనే పాత్రికేయుడిని అల్లరిమూకలు వెంబడించి దాడి చేశాయి. జర్నలిస్టు కారుపై బిజెపి కార్యకర్తలు గుంపులుగా దాడి చేసి ఇంకు చల్లి ధ్వంసం చేశారు.
వాగ్లేపై దాడి జరగడానికి పది రోజుల ముందు ఉత్తరాఖండ్‌ లోని హల్ద్వానీలో పది మంది పాత్రికేయులపై ఓ మూక దాడి జరిపింది. 2002లో నిర్మించిన మరియం మసీదును, అబ్దుల్‌ రజాక్‌ జకారియా మదర్సాను కూల్చివేసిన ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అమృత్‌ విచార్‌ పత్రికకు చెందిన ఫొటో జర్నలిస్ట్‌ సంజరు కనేరాపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్రమైన గాయమైంది. ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఏబీసీ)కు చెందిన దక్షిణాసియా బ్యూరో చీఫ్‌ అవనీ దియాస్‌ సహా న్యూస్‌ మీడియాపై సెన్సార్‌షిప్‌ విధించిన ఘటనలు 12 జరిగాయి.
దేశంలో రెండు సంవత్సరాల పాటు నివసించానని, తన రిపోర్టింగ్‌ గీత దాటినందున వీసా పొడిగింపు ఇవ్వబోమని బిజెపి ప్రభుత్వం తేల్చి చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లాల్సి వస్తోందని దియాస్‌ తెలిపారు. ఈ ఘటన జరగడానికి కొన్ని వారాల ముందు కెనడాకు చెందిన సిక్కు వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై ఎబిసి న్యూస్‌ సిరీస్‌ ప్రసారం చేయకుండా యూట్యూబ్‌ నిషేధం విధించింది. మొత్తంమీద జనవరి నుండి 46 సెన్సార్‌షిప్‌ ఘటనలు వెలుగు చూశాయి.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమం సందర్భంగా హింస, సెన్సాన్‌షిప్‌ వంటి పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించిన పోస్టర్‌ను క్యాంపస్‌లో ప్రదర్శించినందుకు జనవరి 24న పూనే ఫిల్మ్‌ టెలివిజన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులపై కేసులు పెట్టారు. అంతకు ముందు రోజే హిందూత్వ మూకలు క్యాంపస్‌లో ప్రవేశించి నినాదాలు చేశారు. ‘బాబ్రీని, రాజ్యాంగ మరణాన్ని గుర్తుంచుకోండి’ అని రాసి ఉన్న బ్యానర్‌ను దగ్థం చేశారు. ఓ విద్యార్థిని సహా విద్యార్థి సంఘం నేతలపై దాడి చేశారు.
‘రామ్‌ కే నామ్‌’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను పలు రాష్ట్రాల్లో అడ్డుకున్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన దళిత విద్యార్థి, పిహెచ్‌డి స్కాలర్‌ రాందాస్‌ ప్రిని శివానందన్‌ను రెండు సంవత్సరాల పాటు సస్పెండ్‌ చేయడానికి ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన కూడా ఓ కారణమే.

➡️